ఎయిర్‌టెల్‌ సర్వీసులకు అంతరాయం.. మండిపడుతున్న కస్టమర్లు

Interruption to Airtel services. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సర్వీసుల్లో అంతరాయం చోటు చేసుకుంది. ఉదయం 11:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా

By అంజి  Published on  11 Feb 2022 12:48 PM IST
ఎయిర్‌టెల్‌ సర్వీసులకు అంతరాయం.. మండిపడుతున్న కస్టమర్లు

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సర్వీసుల్లో అంతరాయం చోటు చేసుకుంది. ఉదయం 11:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. తమ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఆకస్మికంగా పనిచేయడం ఆగిపోయిందని పలువురు వినియోగదారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ల నుండి కాల్‌లు చేయడం లేదా స్వీకరించడం కూడా చేయలేకపోయారు. బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలతో పాటు, వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను కూడా యాక్సెస్ చేయలేకపోయారు. అయితే ఎయిర్‌టెల్‌ కంపెనీ ఇప్పుడు సేవలను పునరుద్ధరించింది. అయితే ఈ నెలో ఎయిర్‌టెల్‌ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి. దీనిపై కస్టమర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

"మా ఇంటర్నెట్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. దీని వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మా టీమ్‌లు మా కస్టమర్‌లకు ఇబ్బంది లేకుండా సర్వీసులను అందించడానికి పని చేస్తున్నందున ఇప్పుడు ప్రతిదీ సాధారణ స్థితికి చేరుకుంది" అని ఎయిర్‌టెల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అవుట్‌టేజ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. అంతరాయాన్ని ఎదుర్కొంటున్న ఏకైక టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా, ఇతర ప్రధాన నగరాలను ఈ అంతరాయం ప్రభావితం చేసింది. ఎయిర్‌టెల్ సిగ్నల్ సమస్యలకు సంబంధించి ఇప్పటివరకు 3700 కంటే ఎక్కువ నివేదికలు నమోదు చేయబడ్డాయి.

Next Story