వాటికి కేరాఫ్ గా మారిన ఆ యాప్స్ ను బ్యాన్ చేయనున్న 'గూగుల్'
Google Plans on Banning 'Sugar Daddy' Apps on Play Store From September. గూగుల్ ప్లే స్టోర్స్ లో మనకు కావాల్సిన యాప్స్
By Medi Samrat Published on 1 Aug 2021 3:48 PM IST
గూగుల్ ప్లే స్టోర్స్ లో మనకు కావాల్సిన యాప్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. చాలా వరకూ యాప్స్ విషయంలో గూగుల్ ఓ కన్నేసి ఉంటుంది. కానీ కొన్ని యాప్స్ ద్వారా ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా డేటింగ్, చాటింగ్, మీటింగ్ అంటూ సాగే యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది ఇలాంటి యాప్స్ కు బలై డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ డేటింగ్ యాప్స్ ముసుగులో ఏకంగా వ్యభిచారానికి పాల్పడుతున్న యాప్స్ పని పట్టాలని గూగుల్ భావిస్తోంది.
ఇటువంటి చాలా యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద చర్యలు తీసుకోబోతున్నామని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ కూడా టార్గెట్‌గా ఉంది. 'షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్. అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే' అని గూగుల్ ప్లేస్టోర్ తెలిపింది. సాధారణ డేటింగ్ యాప్‌లు కూడా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే వాటి మీద కూడా బ్యాన్ తప్పదని ప్లే స్టోర్ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 1 నాటికి ఈ రకమైన యాప్‌లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండవు. గూగుల్ తన కంటెంట్ పాలసీ విభాగాన్ని అప్‌డేట్ చేసింది. కొత్త పరిమితులు విధించబడతాయి "లైంగిక కంటెంట్‌పై, ప్రత్యేకంగా పరిహార లైంగిక సంబంధాలను నిషేధిస్తుంది" అని ప్రకటనలో ఉంది. ఈ డేటింగ్ యాప్‌లు కొన్ని ప్లే స్టోర్‌లో అనేక మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి.
గూగుల్ యొక్క అప్‌డేట్ పిల్లల రక్షణను, ముఖ్యంగా వారి గోప్యతను మెరుగుపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా పిల్లల కోసం ఉద్దేశించిన అప్లికేషన్స్ ప్రకటనల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోనుంది.