చంద్రుడి ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ పంపిన విక్రమ్ ల్యాండర్

భారత అంతరిక్ష సంస్థ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం నుండి మొట్టమొదటి శాస్త్రీయ డేటాను పొందింది.

By అంజి  Published on  28 Aug 2023 5:44 AM GMT
Chandrayaan 3, Moon, South Pole, ISRO

చంద్రుడి ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ పంపిన విక్రమ్ ల్యాండర్

భారత అంతరిక్ష సంస్థ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం నుండి మొట్టమొదటి శాస్త్రీయ డేటాను పొందింది. ఇది చంద్రయాన్-3 మిషన్ యొక్క ప్రధాన విజయాన్ని సూచిస్తుంది. విక్రమ్ ల్యాండర్ యొక్క థర్మల్ ప్రోబ్ చంద్రుని ఉపరితలంపై, ఉపరితలం లోపల ఉష్ణోగ్రత ఎలా మారుతుందో నమోదు చేసింది. ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) చంద్రుని ఉపరితలం యొక్క ఉష్ణ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, ధ్రువం చుట్టూ ఉన్న చంద్ర ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను వివరిస్తుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. "ల్యాండర్ ఉపరితలం క్రింద 10 సెం.మీ లోతును చేరుకోగల నియంత్రిత వ్యాప్తి యంత్రాంగాన్ని కలిగి ఉన్న ఉష్ణోగ్రత ప్రోబ్‌ను కలిగి ఉంది. ప్రోబ్‌లో 10 పర్సనల్‌ టెంపరేచర్‌ సెన్సార్‌లు అమర్చబడి ఉంటాయి" అని తెలిపింది.

చంద్రుడికి వాతావరణం లేదు. దీని కారణంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత వేగంగా మారుతుంటుందని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపై ఉష్ణోగ్రతకు సంబంధించిన వైవిధ్యాలను గ్రాఫ్ రూపంలో ఇస్రో అందించింది. ఇస్రో షేర్‌ చేసిన గ్రాఫ్‌ ఆధారంగా చంద్రుడి లోతుల్లో మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు అర్థమవుతున్నది. అలాగే లోతుల్లో నుంచి ఉపరితలం వైపు పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. 8 సెంటీమీటర్ల లోతులో మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు ఈ గ్రాఫ్‌ తెలుపుతున్నది. అదే సమయంలో ఉపరితలంపై 50-60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు గ్రాఫ్‌లో కనిపిస్తున్నది.

చంద్రుడి ఉపరితలం, లోతుల్లో ఉష్ణోగ్రతల్లో ఉన్న వైవిధ్యాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నది. చంద్రుని పగలు, రాత్రి సమయంలో చంద్రుని ఉపరితలం గణనీయమైన ఉష్ణోగ్రత మార్పులకు లోనవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు చంద్రుని అర్ధరాత్రి సమయంలో మైనస్‌ 100 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. గరిష్టంగా మధ్యాహ్నం సమయంలో 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే చంద్రునిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని ఇస్రో ఎక్స్‌ వేదికగా తెలిపింది. విక్రమ్ ల్యాండర్ ఆగష్టు 23న తాకింది, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది. టచ్‌డౌన్ స్పాట్‌కు తర్వాత శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు.

Next Story