భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) మరో ప్రయోగానికి సిద్దమైంది. సోమవారం పీఎస్‌ఎల్‌వీ సీ- 52 వాహక నౌక ప్రయోగాన్ని చేపట్టనుంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు ఈ వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున 4.29 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగనుంది. అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ- 52 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లనుంది.
ఈ రాకెట్ ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. అవి ఐఆర్‌శాట్-1-ఏ(1710 కిలోలు), ఐఎన్‌ఎస్-2-టి.డి(1705 కిలోలు)లతో పాటు విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 (8.1 కిలోలు. పీఎస్ఎల్వీ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ పర్యవేక్షిస్తున్నారు. శనివారమే ఆయన షార్‌కు చేరుకున్నారు. ఎంఆర్ఆర్ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కౌంట్‌డౌన్ ప్రక్రియలో పాల్గొన్న ఆయన ఈ రోజు శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తున్నారు.