పడవపై పడచు చిందులు.. తమిళ పాటకు నటి సయేషా డాన్స్
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 July 2020 5:16 PM ISTఅందాల సినీ తార సయేషా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ అద్భుతమైన పాత జ్ఞపకాన్ని పంచుకుంది. బాగా ప్రచారంలో ఉన్న, సెంథిల్ గణేష్ అతని భార్య రాజలక్ష్మి పాడిన.. తమిళ జానపద పాట చిన్నా మచిన్ కు తాను లయబద్దంగా ఉత్సాహంగా పడవపై చిందేస్తున్న వీడియోను అప్ లోడ్ చేసింది. హాలిడేట్రిప్ గా స్పెయిన్ కు వెళ్లినపుడు తీసుకున్న వీడియోను ఎంతో అపురూపంగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఇంతకూ ఈ పాటేంటి.. ఈ డాన్సేంటి.. తెలుసుకోవాలా.. లెట్స్ మూవ్..
అందాల నటి సయేషా సైగల్ 2017లో వచ్చిన తమిళ సినిమా వనమగన్ తో తెరంగేట్రం చేసింది. ఎ.ఎల్.విజయ్ సారథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జయరామ్ రవికి జోడీగా నటించింది. సయేషా షేర్ చేసిన వీడియోలో ఆ ఉరిమే ఉత్సాహం.. పాటలో తన్మయత్వం.. ఆ గ్రేస్ మొత్తమ్మీద హాలిడే మూడ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. వీడియో ప్రారంభంలో సముద్రంపై పడవలు వరసగా కదులుతున్న కమనీయ దృశ్యం కనిపిస్తుంది.
కెమెరా కాస్త ఎడమవైపు తిరగ్గానే సయేషా ఓ పడవ పై చిన్నా మచిన్ పాటకు స్టెప్పులేస్తూ అదరగొడుతున్న దృశ్యం కనువిందు చేస్తుంది. పాట లొకేషన్ స్పెయిన్ లోని టూరిజం స్పాట్ ఇబిజా ద్వీపం అందాలను చూపిస్తూ తన హాలిడేస్ మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు వచ్చేలా కెమెరాకెక్కించింది. టెక్నో, ట్రాన్స్ కు ఆటపట్టుగా ప్రసిద్ధికెక్కిన స్పెయిన్ నేలపై తమిళ జానపద పాట వినడం అత్యద్భుతమని సయేషా తన భావాలను వ్యక్తం చేసింది. తను అచ్చమైన స్వచ్చమైన తమిళ పొన్ను అని వ్యాఖ్యానించింది.
ఓ అందమైన తమిళ అమ్మాయి ఎక్కడో స్పెయిన్ లోని ఇబిజా ద్వీపం సముద్రం అంచున అటూ ఇటూ తేలాడే పడవల మధ్య తమిళ జానపద పాట వింటూ ఉల్లాసంగా డాన్స్ చేస్తుంటే.. ఇబిజాలో ఇడ్లీ హవా.. అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ వీడియో చూశాక ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపించడం ఖాయం. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ కింద.. మిసింగ్.. హాలిడేస్.. మేజర్ మిస్సింగ్.. బెస్ట్ టైమ్స్.. టేక్ మీ బ్యాక్.. బిఫోర్ లాక్ డౌన్ అంటూ రాసుకుంది. అందుకే జ్ఞాపకాలు పదిలమే కాదు ఎప్పటికీ మధురం కూడా! ఈ కరోనా వేళ ఇంటికే పరిమితమైన అందరూ అలనాటి అపురూప క్షణాలను మనసారా తలచుకుంటున్నారు. అంతేకాదు మళ్లీ పాతరోజులు రావాలని ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. సయేషా ఇందుకు మినహాయింపు కాదు.