పొదుపు సంఘాలకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు

By సుభాష్  Published on  20 April 2020 3:33 AM GMT
పొదుపు సంఘాలకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఇక తాజాగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు అందించారు. ఈనెల 24న జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు జగన్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. జగన్‌ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు మేలు చేకూరనుంది.

మహిళా సంఘాల ఖాతాల్లోకి రూ.1400 కోట్లు చేరనున్నాయి. కరోనా కష్టకాలంలో మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిలిచిపోయిన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై జీరో వడ్డీ పథకం ఉంది. కాగా, కొన్ని రోజులుగా ఈ పథకం నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్‌ ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 1.83 లక్షల సంఘాలకు రూ.425 కోట్ల చొప్పున జీరో వడ్డీ సాయం అందనుంది. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మొత్తం 93 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఈ పథకానికి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు ప్రభుత్వం తాజాగా రూ.765.19 కోట్లను విడుదల చేసింది.

కాగా, ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు సోమ, లేదా మంగళవారం విడుదల కానున్నాయి. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న జీరో వడ్డీ పథకం అమలుకు రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నిలిచిపోయిన ఈ పథకాన్ని జగన్‌ పునః ప్రారంభింస్తుండటంతో డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story