కరోనాతో ఏఎస్సై మృతి

By సుభాష్  Published on  19 April 2020 4:52 PM GMT
కరోనాతో ఏఎస్సై మృతి

కరోనా వైరస్‌ రోజురోజుకు మృత్యువును వెంటాడుతోంది. ఏపీలోని అనంతపురం జిల్లా పరిగి ఏఎస్సై ఎస్‌. హబీబుల్లా (52) కరోనాతో రెండు రోజుల కిందట మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలింది. ఆయన కుటుంబ సభ్యులను సైతం క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఏఎస్సై మృతి పట్ల సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుటుంబానికి జగన్‌ అండగా నిలిచారు. కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కాగా, అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన హబీబుల్లా గత మూడేళ్లుగా పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, గత ఇరవై రోజులుగా ఆరోగ్యం బాగాలేనందున విశ్రాంతి తీసుకోవాలని ఎస్సై సూచించి ఇంటికి పంపించారు.

కరోనా కారణంగా రాష్ట్రం అతలాకుతలం అవుతున్న కారణంగా తిరిగి ఆయన విధుల్లో చేరారు. పరిగి ఎస్సై ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొనాపురం పికెట్‌ వద్ద డ్యూటీకి పంపించారు.

కాగా, ఈనెల 16న స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు కరోనా అనుమానంతో హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్య సిబ్బంది ధర్మల్‌ స్కానింగ్‌ చేసినా ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదు. కాగా, అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 17న సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురికావడంతో ఆయన మృతి చెందాడు. హబీబుల్లాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story