పది రోజుల్లో జైలు నుంచి బయటకు రానున్న చిన్నమ్మ..!
By సుభాష్ Published on 23 Oct 2020 5:59 AM GMTఅక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ మరో పది రోజుల్లో బయటకు వచ్చే అకాకాశాలున్నాయని చిన్నమ్మ లాయర్ రాజా చెందూర్ పాండియన్ తెలిపారు. ఆమె విడుదల అయ్యేందుకు జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని అన్నారు. అయితే తన న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు శశికళ ఆదివారం ఓ లేఖ కూడా రాశారు. ఆ లేఖలోని అంశాల ఆధారంగానే ఈ విషయాన్ని చెబుతున్నానని న్యాయవాది పేర్కొన్నారు.
కాగా, కర్ణాటక జైళ్ల నిబంధనల ప్రకారం.. శిక్ష అనుభవించే వారికి నెలలో మూడు రోజులు సత్పవర్తన పరిధిలో ఉంటుందని, ఇలా శశికళకు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం కర్ణాటకలోని కోర్టులకు దసరా పండగ సెలవులు కాగా, ఈనెల 26న కోర్టులు తిరిగి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు వేసిన నాలుగేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టింది. కానీ ఆ పార్టీ నుంచి పళనిస్వామి బృందం ఆమెను తొలగించారు. అక్రమాస్తుల కేసులో ఇళవరసై, సుధాకరన్‌లు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక వేళ పేరోల్ సదుపాయాన్ని వినియోగిస్తే శశికళ విడుదల తేదీని మార్చే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.