మొన్న ట్రిపుల్.. నేడు డబుల్..

By Newsmeter.Network  Published on  28 Jan 2020 10:17 AM GMT
మొన్న ట్రిపుల్.. నేడు డబుల్..

రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్ మెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ తో మ్యాచ్‌లో త్రిపుల్ సెంచరీ సాధించిన ఈ యువ ఆటగాడు వారం తిరిగే లోపే మరో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా సోమవారం హిమాచల్ ప్రదేశ్, ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కాగా టాస్‌ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న హిమాచల్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ తో ముంబై బ్యాట్స్‌ మెన్లను వణికించారు. దీంతో ముంబై 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ మొదట ఆడితూచి ఆడాడు. తరువాత హిమాచల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును సర్ఫరాజ్‌ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌.. దాన్ని డబుల్‌ సెంచరీగా మార్చుకున్నాడు. ఐదో వికెట్‌కు ఆదిత్య తారేతో కలిసి 140 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 పరుగులతో మరో త్రిపుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

కాగా రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే భారీ వర్షం రావడంతో ఆట ప్రారంభం సాధ్య పడలేదు. పలు మార్లు మైదానాన్ని పరీశీలించిన అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు వరుణుడు కరుణిస్తే సర్పరాజ్‌ త్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ లో సర్ఫరాజ్‌.. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరుపున ఆడాడు. అయితే విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌ వంటి స్టార్లు ఉన్నప్పటికి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఫిట్ నెస్‌ సమస్యలో బెంగుళూరును వీడాడు. కాగా ఐపీఎల్-2020 సీజన్‌ లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ తరుపున బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం రంజీలో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ యాజమాన్యం పుల్ హ్యాపీగా ఉంది.



Next Story