సంజు మళ్లీ పాతపాటే.. సిక్స్ కొట్టాడు.. ఆవెంటనే..

By Newsmeter.Network  Published on  31 Jan 2020 8:13 AM GMT
సంజు మళ్లీ పాతపాటే.. సిక్స్ కొట్టాడు.. ఆవెంటనే..

యువ వికెట్ కీపర్‌ సంజు శాంసన్ మరో సారి నిరాశపరిచాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. న్యూజిలాండ్‌ తో జరుగుతున్న టీ20 సిరీస్‌ లో ఇప్పటికే టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకోవడంతో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసింది. ఓపెనర్‌ రోహిత్ శర్మకు విశ్రాంతి నిచ్చి.. అతని స్థానంలో సంజుకు అవకాశం ఇచ్చారు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 8 పరుగులు చేసి తొలి వికెట్‌ గా ఔటయ్యాడు. కుగ్‌లీన్ వేసిన రెండో ఓవర్‌ మొదటి బంతిని సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్‌ కొట్టే యత్నంలో సాన్‌ట్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాచ్‌ ఆరంభమైన కాసేపటికే శాంసన్‌ భారీ షాట్లకు పోయి వికెట్‌ను సమర‍్పించుకున్నాడు. పిచ్‌ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా భారీ షాట్లకు దిగి మూల్యాన్ని చెల్లించుకున్నాడు. మ్యాచ్‌ లో కుదురుకున్నాక భారీ షాట్లకు వెళ్లాలి కానీ.. వచ్చి రాగానే చెత్త షాట్ తో ఔట్‌ అవ్వడం అభిమానులకు విసుగు తెప్పించింది.

ఐదేళ్ల తర్వాత శాంసన్‌కు వచ్చిన రెండో అవకాశం ఇది. దీన్ని కూడా వృథా చేసుకోవడంతో శాంసన్‌ ఏందిది.. అనుకోవడం అభిమానుల వంతైంది. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా చివరి టీ20లో అవకాశం దక్కించుకుని రెండు బంతులే ఆడి నిరాశపరిచాడు. లంకేయులతో సిరీస్‌లో తొలి బంతికి సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఇక పంత్ ప్రత్యామ్నాయంగా సంజును భావిస్తున్న తరుణంలో అతను ఇలా అనవసరపు షాట్లతో పెవిలియన్‌ చేరడం మంచిది కాదు. ఈ అవకాశాన్ని వృధా చేసుకున్న సంజుకు మళ్లీ అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. ఒకవేళ ఐదో టీ20లో సైతం అవకాశం వస్తే సంజు రాణించాలని అతని అభిమానులు కోరుతున్నారు.

Next Story