విద్యార్థినులకు సీఎం జగన్‌ మరో వరం.. ఏంటంటే

By సుభాష్  Published on  10 March 2020 11:54 AM GMT
విద్యార్థినులకు సీఎం జగన్‌ మరో వరం.. ఏంటంటే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. కొత్తకొత్త పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విద్యార్థినులకు ఏపీ సర్కార్‌ శుభవార్త వినిపించింది. విద్యార్థులకు ఇప్పటికే ఎన్నో వరాలు అందించిన జగన్‌.. ఇప్పుడు మరో వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ యంత్రాలలో ఒక రూపాయి వేస్తే నాప్‌కిన్స్‌ వచ్చేలా ఈ యంత్రాన్ని రూపొందించనున్నారు. మొదట పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం దశల వారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లోనూ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హిందుస్తాన్‌ లివర్‌ కంపెనీ సహకారంతో ఈ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన జన ఔషధి దుకాణాల్లో శానిటరీ నాప్‌కిన్స్‌ రూ.4 దొరుకుతుంది. కాగా, ఏపీ ప్రభుత్వం కేవలం ఒక రూపాయికే అందజేయాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, నాడు-నేడు పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా బాలికల కోసం శానిటరీ నాప్‌కిన్స్‌ యంత్రాలను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Next Story