జగన్‌ పాలనపై విపక్షాల ప్రశ్నేంటి..?

By సుభాష్  Published on  8 March 2020 3:28 PM GMT
జగన్‌ పాలనపై విపక్షాల ప్రశ్నేంటి..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనలు వేరే.. ఆయన పాలన వేరు. ఆయన అనుకున్నది సాధించే వరకు ఊరుకోరు. నచ్చిన వాటిపై ఎవరు ఏమన్నా.. పట్టించుకోరు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనలో దూసుకుపోతున్నారు. మొదట్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు జగన్‌. అధికారులను సైతం ఉరుకులు, పరుగులు పెట్టించాడు. రాష్ట్ర ప్రజలకు కొత్త పథకాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చారు. అంతేకాకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇటీవల శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, జగన్‌ అన్న మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. శాసన మండలి ఎందుకు..? అది ఉత్తి దండగ, సంవత్సరానికి రూ. 60 కోట్ల ఖర్చు. ఇలా వృధా అవుతున్న ఖర్చు గురించి చెప్పుకొచ్చారు. జగన్‌ చెప్పిన మాటలను ప్రజలు, మేధావులు అంగీకరిస్తున్నారు.

అంతేకాదు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చుల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక సలహాదారుల వ్యవస్థ బాగా పటిష్టమైనది. ఒకరా.. ఇద్దరా.. ఏకంగా 30 మందికిపైగా జగన్‌ కొలువులో సలహాదారులుగా ఉన్నారని సమాచారం. వీరందరికీ కేబినెట్‌ హోదాలు, నెలకు లక్షల్లో జీతాలు అవన్నీ చూస్తుంటే తడిసిమోపెడవుతుంది. మరి ఆర్థికంగా ఇబ్బందులున్నసమయంలో ఇంత మందిని పెట్టుకోవడం ఎందుకనేది విపక్షాల్లో, ప్రజల్లో వస్తున్న ప్రశ్న.

మరో నియామకం

కాగా, సీఎం జగన్‌ తాజాగా రాజస్థాన్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ని తన ముఖ్య ఆర్థిక సలహదారుగా నియమించుకున్నారు. ఆయనకు కేబినెట్‌ హోదాని కల్పించి మంచి జీత భత్యాలు కూడా కల్పించారు. ఇప్పటికే జగన్‌ జట్టులో రాజకీయ సలహాదారులు ఎంతో మంది ఉన్నారు. వీరంతా కూడా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

యనమల రామకృష్ణుడు ఏమన్నారంటే..

దీనిపై విపక్షనేత యనమల రామకృష్ణుడు జగన్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. దండుగా మారిన వ్యవస్థగా సలహాదారులను పదుల సంఖ్యలో నియమించుకుపోతున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు భారం కావడం తప్ప ప్రభుత్వానికి ఒరిగిందేమి లేదని చెప్పుకొచ్చారు. అసలే భారంగా ఉండి, పైసా ఆదాయం లేని సమయంలో దానిని విస్మరించి జగన్‌ చేస్తున్న వృధా ఖర్చులకు ప్రజలకు జగన్‌ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Next Story
Share it