సమంత ఇంట.. ఈ వారం అంతా క్యారెట్ వంట
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2020 1:52 PM ISTకరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని నిలిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. ఇప్పుడప్పుడే స్టార్ హీరో, హీరోయిన్లు షూటింగ్స్‌ల్లో పాల్గొనమని ఇప్పటికే చెప్పేశారు. ఇక అక్కినేని సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తరువాత కూడా సమంత కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్లు సాగిపోతూనే ఉంది. ఇక లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని సమంత బాగా వినియోగించుకుంటోంది. యోగా ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంది. ఇంటి టెర్రస్ పై యొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది కూడా సేంద్రియా పద్దతిలో. తనకు కావాల్సిన పండ్లు, కాయగూరలను తన ఇంటిపైనే స్వయంగా పండించుకుంటోంది. ఇందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా.. ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఇక తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో సమంత క్యారెట్లను పట్టుకుని నిలబడింది. ఇవి తన ఇంటిపై పండించిన క్యారెట్‌లు అని చెప్పింది. ఇక ఈ వారమంతా.. వాళ్ల ఇంటిలో క్యారెట్‌తో వంటలు చేయబోతోందట. 'ఈ వారం మెనూ.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా' అని పోస్ట్ చేసింది అమ్మడు. ఇది చూసిన అభిమానులు పాపం చైతన్య ఇక ఈ వారం అంతా క్యారెట్ తినక తప్పదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.