వర్మకి షాక్‌.. 'మర్డర్‌'కి బ్రేక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 10:46 AM GMT
వర్మకి షాక్‌.. మర్డర్‌కి బ్రేక్‌

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయినా కూడా వర్మ కంపెనీ మాత్రం వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తుంది. నగ్నం , క్లైమాక్స్ , థ్రిల్లర్ , పవర్ స్టార్ సినిమాలు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ ద్వారా ప్రేక్షకుల మీదకు వదిలాడు వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. దీనికి కుటుంబ కథా చిత్రమ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయ‌త్రి భార్గవి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు పాటలను విడుదల చేశాడు వర్మ.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మృతుడి భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటున్నారని ఆరోపించారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో సినిమా విడుదల అయితే.. కేసుపై ప్రభావం పడుతుందని సినిమా విడుదలను ఆపాలని నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రణయ్‌ హత్య కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మర్డర్‌ సినిమా చిత్రీకరణను నిలిపివేయాలంటూ నిర్మాతలను ఆదేశించింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రామ్‌గోపాల్‌ వర్మ, నట్టి కిరణ్‌లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారికి ఉత్తర్వులను వెంటనే అందజేయాలని ఆదేశించింది. దీంతో మర్డర్ సినిమా కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Next Story