నేటి నుంచి సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయి నీటి విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 9:32 AM GMT
నేటి నుంచి సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయి నీటి విడుదల

నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజునుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగర్జున సాగర్ సీఇ ని ఆదేశించారు. కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున, ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్‌ ఆయకట్టు రైతులకు ఈ వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.

ఇదిలావుంటే.. ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను ఇటీవ‌ల జ‌రిగిన‌ రాష్ట్ర కేబినెట్‌లో అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనాశీలతకు నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై కేబినెట్ చర్చించింది.

రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారు.

Next Story