కర్నూలులో ఎస్సై అదృశ్యం.. ఇదే నా చివరి మెస్సేజ్‌ అంటూ..

By అంజి  Published on  1 March 2020 5:14 AM GMT
కర్నూలులో ఎస్సై అదృశ్యం.. ఇదే నా చివరి మెస్సేజ్‌ అంటూ..

ముఖ్యాంశాలు

  • కర్నూలు: పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఎస్సై మెస్సేజ్‌ కలకలం
  • ఇదే చివరి మెస్సేజ్‌ అంటూ పోస్టు చేసిన రుద్రవరం ఎస్సై విష్ణు
  • విధుల్లో నిర్లక్ష్యం వహించాడని పిలిపించిన అధికారులు

కర్నూలు జిల్లాలోని పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ ఎస్సై పెట్టిన మెస్సేజ్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇదే చివరి మెస్సేజ్‌ అంటూ రుద్రవరం ఎస్సై విష్ణు.. పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించాడని పోలీసు ఉన్నతాధికారులు పిలిపించడంతో ఎస్సై విష్ణు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. మెస్సేజ్‌ చేసిన ఎస్సై ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదు. విష్ణు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై విష్ణు.. ఈ మెస్సేజ్‌ నుంచి ఎక్కడి నుంచి చేశాడు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం.. ఇది ఏపీ పోలీస్‌ శాఖలో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఎస్సై ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టిన మెస్సేజ్‌ను ఆళ్లగడ్డ డీఎస్పీ చూసి.. ఎస్సై విష్ణు ఇంటికి వెళ్లాడు. మెస్సేజ్‌పై ఆరా తీయగా.. అదంతా ఏమీ లేదు సార్‌ అంటూ విష్ణు బదులిచ్చాడని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఎస్సై కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సై విష్ణు కనిపించకపోవడంతో భార్య, తల్లి ఆవేదన చెందుతున్నారు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎస్సై విష్ణు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని భార్య విష్ణు ప్రియ చెప్పారు. ఎదో గొడవ విషయంలో జిల్లా ఎస్పీ తనకు పనిష్‌మెంట్‌ ఇచ్చాడని, చాలా బాధపడ్డానని చెబుతూ బయటకు వెళ్లాడని అతని భార్య ఓ మీడియా సంస్థకు సమాచారం అందించింది. చచ్చిపోతా.. చచ్చిపోతా అంటూ చాలా సేపు ఏడ్చాడని అతని భార్య విష్ణుప్రియ తెలిపింది. రాజకీయ నాయకులకు తొత్తులుగా పోలీసులు శాఖ అధికారులు మారినట్లు తెలుస్తోంది. న్యాయం చేసినా కూడా తనకు పనిష్‌మెంట్‌ ఇచ్చారని ఎస్సై విష్ణు ఆవేదన చెందాడని అతని భార్య చెబుతోంది. గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో రాజకీయ నాయకుల అండదండలతో పోలీసు అధికారులు ఇష్టం వచ్చిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం.

Next Story
Share it