ఉద్రిక్తంగా మారిన సామూహిక నిరాహార దీక్ష
By Medi Samrat
ముఖ్యాంశాలు
- జేఏసీ నేతల అరెస్ట్
- మెట్టు దిగిన నేతలు
- కనికరించని ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మె నేఫథ్యంలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 10 గంటలకు వీఎస్టీలోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్ష నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి కార్మికులు ఎవరు కూడా రాకుండా ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారులను అష్టదిగ్బంధనం చేశారు.
పోలీసులు అడ్డుకోవడంతో అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రభుత్వం 3 వేల కోట్లు భాకి ఉందని.. కో-ఆపేరటివ్ నిధులు రూ. 565 కోట్లు, పీఎఫ్ నిధులు రూ. 723 కోట్లు ప్రభుత్వం వాడుకుందని అన్నారు. అసెంబ్లీలో రవాణ మంత్రి ఆర్టీసీకి ప్రభుత్వం భాకి ఉందని.. నిధులు విడుదల చేయాలని స్పష్టంగా మాట్లాడారని.. ఇప్పుడు సీఎం మాత్రం.. ఆర్టీసీ కి బాకీ లేమని చెబుతున్నారని పైర్ అయ్యారు. మేము చట్టాన్ని అమలు చేయమని కోరుతున్నామని అన్నారు. మా ప్రధాన డిమాండ్ ను వదిలి... మిగతా సమస్యలపై చర్చల కు సిద్ధం గా ఉన్నామన్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కారణంగా 27 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇలాంటివి ఇక జరగకూడదని.. కార్మికుల భవిష్యత్ కోసం ఒక మెట్టు దిగి వచ్చామన్నారు.
సామూహిక దీక్ష నేఫథ్యంలో హైదరాబాద్.. పాతబస్తీ ఫారూఖ్ నగర్ డిపో ముందు దాదాపు 15 మంది ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. వారందరిని ఫలక్ నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఫారూఖ్ నగర్ కార్మిక నేతలు, కార్మికులు, మహిళ కార్మికులు కూడా ఉన్నారు.