10 సార్లు కూడా బస్‌ భవన్‌కు వచ్చిన పాపన పోలేదు: అశ్వత్థామరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 5:47 AM GMT
10 సార్లు కూడా బస్‌ భవన్‌కు వచ్చిన పాపన పోలేదు: అశ్వత్థామరెడ్డి

ముఖ్యాంశాలు

  • 'సబ్బండ కులాల మహాదీక్ష'కు పోలీసులు అనుమతి నిరాకరణ
  • మందకృష్ణ మాదిగను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రెండో రోజు అశ్వత్థామరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ రోజు ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన సబ్బండ కులాల మహాదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌, ఇందిరాపార్క్‌ పరిసరాల్లో వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు దారీ మళ్లీస్తున్నారు. ఇందిరా పార్కు చుట్టూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు హబ్సిగూడలోని ఓ లాడ్జ్‌లో ఉన్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అదుపులోకి తీసుకొని నాచారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్‌ చేశారని సమాచారం అందండంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.

Manda

ఈ నెల 18న హైకోర్టులో విచారణ

హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ఫైనల్‌ అఫిడవిట్‌ను ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్పొరేషన్‌ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని అఫిడవిట్‌లో తెలిపారు. యూనియన్‌ నేతలు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని.. మళ్లీ విలీనం డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టే అవకాశముందని అఫిడవిట్‌లో తెలిపారు. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ సమస్యల పరిష్కారంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనుంది.

రెండోరోజు దీక్ష

ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరుకుంది. శనివారం ఆర్టీసీ జేఏసీ నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం, కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఆర్టీసీ ఎండీ అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఇది కేవలం ప్రభుత్వం రాస్తున్న అఫిడవిట్‌పై ఎండీ సంతకం పెట్టి కోర్టుకు సబ్మిట్‌ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఎండీకి అవగహన లేదని.. ఆర్టీసీ ఎండీ ఇంచార్జి తీసుకొని దాదాపు 17 నెలలు అయిన 10 సార్లు కూడా బస్సు భవన్‌కు వచ్చిన పాపన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల వరకు ఎండీ లేకపోవడం దురదృష్టకరమని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఎండీని నియమించకపోవడం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేసి నిర్మూలించే పథకంలో భాగమేనని ఆరోపించారు. అందుకు నిరసనగానే ఈ సమ్మె కొనసాగుతోందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను, ప్రజా రవాణాను కాపాడుకోవడానికి సమ్మె జరుగుతున్నది. ప్రజలంతా మద్దతు తెలపాలని అశ్వత్థామరెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి: సమ్మెను ‘ఇల్లీగల్‌’ అని ప్రకటించాలి: ఆర్టీసీ ఎండీ

Next Story