రాయల్స్ విధ్వంసం ముందు చేతులెత్తేసిన‌ పంజాబ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2020 2:42 AM GMT
రాయల్స్ విధ్వంసం ముందు చేతులెత్తేసిన‌ పంజాబ్

జ‌ట్టు నిండా విధ్వంస‌క‌ర ఆట‌గాళ్ల‌తో నిండి ఉన్న రాజస్తాన్‌ రాయల్స్ నిన్న పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో‌ సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని మట్టిక‌రిపించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టులో క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. రాజస్తాన్‌ రాయల్స్ బౌల‌ర్ల‌లో ఆర్చర్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 186 పరుగుల విజ‌య‌ లక్ష్యంతో బ‌రిలో దిగిన రాయ‌ల్స్‌.. ఆది నుండి ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో 17.3 ఓవర్లలోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. మురుగన్‌ అశ్విన్, క్రిస్‌ జోర్డాన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇదిలావుంటే.. యూనివ‌ర్స‌ల్ బాస్‌ గేల్ ఈ మ్యాచ్‌లో సిక్సర్లతో రెచ్చిపోయాడు. 33 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది సిక్స‌ర్లు బాదిన‌ గేల్‌ను.. ఆర్చర్‌ అద్భుత యార్కర్‌తో 99 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద పెవిలియ‌న్ చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో టి20 క్రికెట్‌లో చ‌రిత్ర‌లోనే ఎవ‌రికి సాధ్యం కాని ఓ రికార్డు సాధించాడు. 1000 సిక్స్‌ల మైలురాయి సాధించిన తొలి క్రికెటర్‌గా‌ గేల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

Next Story