రాయల్స్ విధ్వంసం ముందు చేతులెత్తేసిన పంజాబ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2020 2:42 AM GMTజట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లతో నిండి ఉన్న రాజస్తాన్ రాయల్స్ నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్.. ఆది నుండి ఆకాశమే హద్దుగా చెలరేగింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు), బట్లర్ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇదిలావుంటే.. యూనివర్సల్ బాస్ గేల్ ఈ మ్యాచ్‌లో సిక్సర్లతో రెచ్చిపోయాడు. 33 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది సిక్సర్లు బాదిన గేల్‌ను.. ఆర్చర్ అద్భుత యార్కర్‌తో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో టి20 క్రికెట్లో చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని ఓ రికార్డు సాధించాడు. 1000 సిక్స్‌ల మైలురాయి సాధించిన తొలి క్రికెటర్‌గా గేల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.