ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 1:36 PM GMTభారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎంతో మంది బౌలర్లకు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడే వారిలో రోహిత్ బారీన పడని బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. బౌలర్లపై అధిపత్యం చెలాయించడం అంటే హిట్‌మ్యాన్‌కు ఎంతో ఇష్టం. అలాంటి రోహిత్ శర్మను ఓ బౌలర్ ఇబ్బంది పెట్టాడంట. అతనే ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ.
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రోహిత్ శర్మ తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమితో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించాడు. కెరీర్‌లో నిన్ను ఇబ్బంది పెట్టిన నలుగురు బౌలర్లు ఎవరు అని షమి అడిగిన ప్రశ్నకు హిట్ మ్యాన్ పలు విషయాలను వెల్లడించాడు.
కెరీర్ ఆరంభంలో.. 2007లో నేను మొదటి సారి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాను. రేపు మ్యాచ్ అనగా.. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. అందుకు కారణం బ్రెట్‌లీనే. ఆ సమయంలో బ్రెట్‌లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. 150కి.మీ వేగంతో బంతులు వేసే బ్రెట్‌లీని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఆ రాత్రి నిద్రపోలేదు. ఇక ఆ రాత్రంతా బ్రెట్ లీ బౌలింగ్ చేసే వీడియోలు చూస్తూ.. అతడిని ఎలా ఎదుర్కొనాలో ఆలోచించా అని చెప్పాడు రోహిత్.
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను ఎదుర్కొనడం కూడా కష్టమేనని అన్నాడు. పేస్, స్వింగ్‌ను ఒకే సమయంలో ఆడటం ఓ పీడకలగా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్ లో దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా, ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడినట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. ఇక టెస్టు క్రికెట్‌లో హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొనడానికి ఇష్టపడడం లేదు. క్రమశిక్షణ కలిగిన అతడి బౌలింగ్ లెంగ్త్ మిస్ అవ్వదు. అతన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి అని రోహిత్ అన్నాడు.