క‌రోనా పై పోరుకు గిబ్స్ సాయం.. వేలానికి ఆ రికార్డు బ్యాట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2020 1:49 PM GMT
క‌రోనా పై పోరుకు గిబ్స్ సాయం.. వేలానికి ఆ రికార్డు బ్యాట్

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో పేద‌లు ప‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాడేందుకు ఇప్ప‌టికే ప‌లువురు క్రీడాకారులు ముందుకు వ‌చ్చి ఆర్థిక సాయాన్ని అందించ‌గా.. మ‌రికొంద‌రు త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను వేలం వేసి.. వ‌చ్చిన న‌గ‌దును విరాళంగా ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‌హెర్షెల్ గిబ్స్ చేరిపోయాడు.

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో 435 ప‌రుగులు అత్య‌ధిక చేద‌న రికార్డు ద‌క్షిణాఫ్రికా పేరు మీద ఉంది. దాదాపు 14 ఏళ్ల క్రితం జ‌రిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 435 ప‌రుగుల రికార్డు ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా చేధించింది. ఆ మ్యాచ్‌లో ‌హెర్షెల్ గిబ్స్ వీరవిహారం చేయ‌డంతో.. ద‌క్షిణాఫ్రికా విజ‌యాన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో గిబ్స్ 111 బంతుల్లో 21 పోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 175 ప‌రుగులు చేసి విజ‌యంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇప్ప‌డు ఆ మ్యాచ్‌లో తాను వినియోగించిన బ్యాట్‌ను వేలానికి ఉంచాడు గిబ్స్‌. ఆదేశానికే చెందిన డివిలియ‌ర్స్ ఆర్‌సీబీకి చెందిన జెర్సీని వేలంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే.

2006లో ఆస్ట్రేలియా ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టించింది. జోహెన్నెస్‌బర్గ్ వేదిక‌గా ఐదో వ‌న్డే జ‌రిగింది. ఆమ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. అప్ప‌టి ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ (164;105 బంతుల్లో 13పోర్లు 9 సిక్స‌ర్ల ) భారీ శ‌త‌కాన్ని బాద‌డంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 434 ప‌రుగులు చేసింది. దీంతో అంద‌రూ విజ‌యం ఆసీస్‌దేన‌ని బావించారు. భారీ ల‌క్ష్యాన్ని చేదించే క్ర‌మంలో 3 ప‌రుగుల‌కే ద‌క్షిణాప్రికా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో ఓపెన‌ర్‌ గ్రేమ్ స్మిత్ (90; 55 బంతుల్లో 13 పోర్లు, 2 సిక్స‌ర్లు)కు హెర్షెల్ గిబ్స్ జ‌త‌క‌లిసాడు. వీరిద్ద‌రు ఎడాపెడా బౌండ‌రీలు బాదారు. జ‌ట్టు స్కోర్ 190 వ‌ద్ద సిత్మ్ ఔట్ కాగా.. 299 ప‌రుగుల వ‌ద్ద గిబ్స్ పెవిలియ‌న్ చేరాడు. ఈ ద‌శ‌లో సౌతాఫ్రికా వ‌రుస వికెట్లు కోల్పోయింది. అయితే.. కీప‌ర్ మార్క్ బౌచ‌ర్ (50 నాటౌట్; 43 బంతుల్లో 4 పోర్లు) చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 49.5 ఓవ‌ర్ల‌లో 9 వికెట్టు కోల్పోయి 438 ప‌రుగులు చేసింది.

కాగా.. ఆ మ్యాచ్‌లోని బ్యాట్‌ను వేలానికి ఉంచాడు గిబ్స్‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశాడు. '438 పరుగుల ఛేదనలో నేను ఉపయోగించిన బ్యాట్‌ను వేలానికి ఉంచుతున్నా. ఇన్నాళ్ల నుంచి ఆ బ్యాట్‌ను నా వద్దే భద్రంగా ఉంచుకున్నా. కరోనా కోసం అందరూ తమవంతు సాయం చేయండి' అని గిబ్స్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.Next Story