గేల్‌ను త‌ప్పించ‌డంలో కోచ్ పాత్ర లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 3:37 PM GMT
గేల్‌ను త‌ప్పించ‌డంలో కోచ్ పాత్ర లేదు

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(సీపీఎల్‌) లో జ‌మైకా త‌ల‌వాస్ జ‌ట్టు నుంచి విధ్వంస‌క వీరుడు క్రిస్ గేల్‌ను తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. దీనికి ఆ జ‌ట్టు కోచ్ రామ్ న‌రేశ్ శ‌ర్వాణ్ కార‌ణ‌మంటూ గేల్ ఆరోపించాడు. త‌న‌ను తొల‌గించ‌డంలో శ‌ర్వాణ్ కీల‌క పాత్ర పోషించాడ‌ని, అత‌ను క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌నీ, పాము కంటే విష‌పూరిత‌మ‌ని గేల్ మండిప‌డ్డాడు. కాగా.. ఈ వ్యాఖ్య‌ల‌ను జ‌మైకా త‌ల‌వాస్ ఖండించింది.

గేల్ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి ఉండ‌కూడ‌దు. బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసే ముందు కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ఓ ఆట‌గాడిని తీసుకోవాలా వ‌ద్దా అనేది ఫ్రాంచైజీ నిర్ణ‌యిస్తుంది. ఇందులో శ‌ర్వాన్ పాత్ర ఏమీలేద‌ని జ‌మైకా త‌ల‌వాస్ స్ప‌ష్టం చేసింది. ఇది పూర్తిగా ప్రాంఛైజీ తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని చెప్పింది.

‘ గేల్‌ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానికి సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ ఉంది.. ఫ్రాంచైజీ కూడా ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతో కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు’ అని తలవాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

2013 నుంచి 2016 వ‌ర‌కు జ‌మైకా త‌ల‌వాస్ ప్రాతినిధ్యం వ‌హించాడు గేల్. ఆత‌రువాత వేరే ప్రాంఛైజీ త‌రుపున ఆడి.. 2019లో మ‌ళ్లీ ఆ జ‌ట్టుకు తిరిగివ‌చ్చాడు. ఈ క్ర‌మంలో మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త‌న కెరీర్‌ను హోం టౌన్ ఫ్రాంచైజీతోనే ముగించాల‌నే ఉద్దేశ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు గేల్ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించాడు. అయితే తాజా సీజన్‌లో గేల్‌ను జమైకా తలవాస్‌ వదిలేసుకుంది. 2019లో ఒక్క మ్యాచ్‌లో మిన‌హా గేల్ పెద్ద‌గా రాణించ‌లేదు. 10 ఇన్నింగ్స్‌లో 243 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో ప్రాంచైజీ అత‌డికి వ‌దిలేసింది.

Next Story