కోహ్లీ రికార్డును రోహిత్‌ దాటేనా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2020 2:53 PM IST
కోహ్లీ రికార్డును రోహిత్‌ దాటేనా..?

క్రికెట్‌ ప్రేమికులను అలరించడానిక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) సిద్దమైంది. 8 జట్లు దాదాపు రెండు నెలల పాటు వినోదాన్ని పంచనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 7.30గంటలకు అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. రోహిత్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తో మిస్టర్‌ కూల్‌ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా టైటిల్‌ ఫేవరెట్లు కావడంతో.. మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మరో 42 పరుగులు చేస్తే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేరు మీద ఉంది. కోహ్లీ చెన్నై పై 747 పరుగులు చేయగా.. రోహిత్‌ 705లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ చెలరేగి 42 పరుగులు చేస్తే చెన్నై పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు.

ఇక చెన్నై కెప్టెన్‌ ధోనిని కూడా మరో రికార్డు ఊరిస్తోంది. ఈ సీజన్‌లో ధోని మరో నాలుగు మ్యాచ్‌లు అడితే.. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సురేష్‌ రైనా పేరు మీద ఉంది. రైనా ఇప్పటి వరకు 193 మ్యాచ్‌లు ఆడాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ నుంచి రైనా తప్పుకోవడంతో.. ధోని రైనా రికార్డును ఈజీగా అధిగమించనున్నాడు.

చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కూడా ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ సీజన్‌లో జడేజా 73 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలో 2000 పరుగులు, 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలనున్నాడు.

ఇక మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నిని ఘనంగా ప్రారంభించాలని ఇరు జట్లు బావిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌ నాలుగు సార్లు కప్పు గెలవగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు సార్లు టైటిల్‌ సాధించింది. ఇరు జట్లు టైటిల్ ఫైట్‌లో మూడు సార్లు తలపడగా 2-1తో ముంబైనే పై చేయిసాధించింది.

Next Story