తెలంగాణలో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

By రాణి  Published on  25 Dec 2019 9:44 AM GMT
తెలంగాణలో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ముఖ్యాంశాలు

  • తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన రోడ్డు ప్రమాదాల సంఖ్య
  • గత ఏడాదితో పోలిస్తే 2019లో ప్రమాదాలు తగ్గుముఖం
  • పటిష్టమైన చర్యలవల్లే సాధ్యమయ్యిందంటున్న అధికారులు
  • అన్నిశాఖలూ కలసికట్టుగా పనిచేస్తున్న తీరు అమోఘం
  • రోడ్డు భద్రతపై ప్రత్యేకమైన అవగాహన కల్పించే ప్రయత్నాలు
  • భారీగా తగ్గిన ప్రమాదాలు, మృతుల సంఖ్య

హైదరాబాద్ : కిందటి సంవత్సరంతో పోలిస్తే 2019లో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు అధికారిక నివేదికలు, గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెలవరకూ అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 5,539 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్టు, 20,060 మంది గాయపడినట్టు, 19,538 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఎక్కువశాతం రోడ్డు ప్రమాదాలు సైబరాబాద్, రాచకొండ, వరంగల్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో జరిగినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీలైనంతవరకూ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు, వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించేలా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఏడాది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. 2017 సంవత్సరంతో పోలిస్తే 2018లో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. పోలీస్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అధారిటీ కలసికట్టుగా పరిస్థితులను మెరుగుపరిచేందుకు బాగా కృషి చేశాయి. తరచూ ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి రహదారులపై తగిన హెచ్చరికలతోకూడిన బోర్డులను ఏర్పాటు చేయడంవల్ల ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు తగ్గుముఖంపట్టాయి.

ప్రత్యేక శ్రద్ధతీసుకుని యాక్సిడెంట్లకు గల కారణాలను గుర్తించి ఆయా స్పాట్లలో రోడ్లకు మరమ్మతులు చేయడంవల్ల చాలా వరకూ రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోయిందనీ, అలాగని పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరలేదని చెప్పడమూ కుదరదనీ రోడ్లు భవనాలు శాఖ అధికారులు అంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే కొంతమేరకు ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడంవల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య, ప్రమాదాల్లో మృతి చెందినవారి సంఖ్య తగ్గిందని అంటున్నారు.

రహదారుల నెట్వర్క్

జాతీయ రహదారులు 3,824 కి.మీ
రాష్ట్ర రహదారులు 2,149 కి.మీ
ప్రధానమైన జిల్లా రహదారులు 12,071 కి.మీ
ఇతరత్రా జిల్లా రహదారులు 13,301 కి.మీ
మొత్తం 31,345 కి.మీ

సంవత్సరాల వారీగా గణాంకాలు 2019

సంవత్సరం రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య
2019 20,060 19,538
2018 21,818 20,325
2017 21,697 20,378

సెప్టెంబర్ 3, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య

మోటారు కార్లు 14,55,340
గూడ్స్ క్యారేజ్ వెహికిల్స్ 04,95,145
ట్రాక్టర్లు– ట్రైలర్లు04,83,894
ఆటో రిక్షాలు04,16,334
మోటార్ క్యాబ్స్ 01,20,551
మ్యాక్సీ క్యాబ్స్29,952
విద్యా సంస్థల వాహనాలు 27,343
స్టేజ్ క్యారేజ్ వాహనాలు 17,790
కాంట్రాక్ట్ క్యారేజ్ వాహనాలు 8,513
ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 2,779
ఈ రిక్షా, ఈ కార్ట్ 156
ఇతర వాహనాలు66,401

రోడ్లమీద వేగానికి పరిమితి విధించడం, వేగ నిరోధాలను ఏర్పాటు చేయడం, నిబంధనలను అతిక్రమించినవారికి జరిమానా విధించడం లాంటి చర్యలవల్ల వేగం కారణంగా జరిగే ప్రమాదాలకు కొంతవరకూ అడ్డుకట్ట పడిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నిధులతో హైదరాబాద్ బీజాపూర్ కారిడార్ నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్ ని రూ.28.66 కోట్ల నిధులతో పూర్తి చేయడం మరో సంతోషకరమైన అంశం. ఈ పథకం కింద బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని సరిచేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే వారికి పూర్తి స్థాయిలో ప్రమాదాలపట్ల అవగాహన కల్పించడమే కాక, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన అత్యవసర వైద్య సేవల్ని పలుచోట్ల అందుబాటులో ఉంచడంద్వారా చాలా ప్రాణాలను కాపాడగలిగామని అధికారులు చెబుతున్నారు.

ఈ వ్యూహాలను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు కనిపించాయి కాబట్టి రాష్ట్రం మొత్తం ఇలాంటి చక్కటి కార్యక్రమాలను, ప్రణాళికలను దీనికి సంబంధించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. లెర్నింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారికి రోడ్డు భద్రత గురించి ప్రత్యేకమైన పాఠాలను బోధించే విధంగా రవాణా శాఖ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దీనివల్ల ప్రజల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన పెరిగిందని అధికారులు అంటున్నారు.

Next Story