రక్తమోడిన రహదారులు.. మెదక్ జిల్లాలో 12 మంది మృతి

By సుభాష్  Published on  17 March 2020 12:56 AM GMT
రక్తమోడిన రహదారులు.. మెదక్ జిల్లాలో 12 మంది మృతి

ముఖ్యాంశాలు

  • ఒకే రోజు మూడు ప్రమాదాలు

  • ఏడుపాయలకు వెళ్తూ ఏడుగురు మృతి

  • వీడ్కోలు పలికి వస్తుండగా మరో ఐదుగురు

  • రోదనలతో దద్దరిల్లిన రహదారులు

తెలంగాణలోని మెదక్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రమాదాలు ఎ క్కువవుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు బలవుతున్నాయి.

సోమవారం మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందారు. ఒకే రోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. జిల్లాలోని కాల్చారం మండలం, సంగయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఏడుపాయల్లో మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ..

సంగారెడ్డి జిల్లా పసల్ వాది మండలం గంజిగూడెంకు చెందిన గొడుగు రాములు ఏడుపాయల్లో అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు బంధువులను ఆహ్వానించారు. దీంతో ఆదివారం రాత్రి కొంత మంది ఏడుపాయలకు చేరుకోగా, సోమవారం ఉదయం సుమారు 25 మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు డీసీఎంలో బయలుదేరారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తున్నసంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 35 టీ7452) అతివేగంగా డీసీఎంను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయలైన వారిలో ఇద్దరి పరస్థితి విషమించచడంతో మార్గంమధ్యంలోనే మృతి చెందారు. మృతుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది.

మృతులు సంగారెడ్డి జిల్లా అంగడిపేటకు చెందిన మాధవి (40), కంది మండలం చెర్యాల గ్రామానికి చెందిన మన్నె మంజుల (40), గంజిగూడెంకు చెందిన నీరుడి దుర్గమ్మ (58), పసల్ వాదికి చెందిన గొడుగు రజిత (45), సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దిగ్వాల్ మధురిమ (9) ఉన్నారు. కాగా, బస్సు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కంటతడి పెట్టిన కలెక్టర్‌

సంగారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మెదక్ ఏరియా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను, మృతుల కుటుంబ పరామర్శించారు. చిన్నారి మధురిమ తల్లి మంజుల కలెక్టర్ కాళ్లపై పడి రోధించడం కలెక్టర్ తో పాటు ఇక్కడున్నవారంతా కంటతడి పెట్టారు.

Road Accident1

నార్సింగ్ సమీపంలో..

ఇదే జిల్లాలో సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి ఓ ఓమ్ని వ్యాన్ వేగంగా ఢీకొట్టడంతో వ్యాన్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేటకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. వీరంతా హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి సిరిసిల్లకు వస్తున్న సమయంలో ఓమ్ని వ్యాన్ మరో డీసీఎంను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదాల విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగగానే డీసీఎం ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా ఈ ప్రమాదాలు మెదక్ జిల్లాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Road Accident2

వీడ్కోలు పలికి వస్తుండగా..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందిన పిట్ల రవి దుబాయ్ కి వెళ్తుండటంతో తోడల్లుడు కృష్ణ, వదిన కావ్య, తాత కిష్టయ్య, బావమరిది అజయ్ మారుతీలు ఓమ్నివ్యాన్ లో శంషాబాద్ కు వెళ్లి విడ్కోలు పలికారు. ఇక తిరుగు ప్రయాణమైన వీరి వాహనం నార్సింగ్ వద్ద ఆగివున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో మాచారెడ్డికి చెందిన కిష్టయ్య (60), డ్రైవర్ ఆంజనేయులు (25), రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన కృష్ణ (28) అక్కడికక్కడే మృతి చెందగా, కృష్ణ భార్య కావ్య, ఆమె తమ్ముడు అజయ్ కు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రామాయంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అత్తగారింటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి..

అలాగే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య (28) హైదరాబాద్ లో ని సుచిత్ర వద్ద నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి బాన్సువాడలో ఉంటున్న అత్తగారింటికి బైక్ పై వెళ్తుండగా, మనోహరాబాద్ మండల కేంద్రం సమీపంలో లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it