హైటెక్ సిటీ వద్ద 'బీఎండబ్ల్యూ' బీభత్సం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2019 10:49 AM ISTభాగ్యనగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు రాంగ్ రూట్ డ్రైవింగ్, మరో వైపు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు మితిమీరిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది. తప్పతాగి వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నా..మద్యం బాబుల తీరు ఏ మాత్రం మారడం లేదు. రెండు రోజుల క్రితం నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. బైక్‌ను కారు ఢీకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చి బులెట్ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడు అధికంగా మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.