కరోనాపై వార్ : కేసీఆర్.. జగన్ తీరుపై ఆర్కే 'కొత్తపలుకు'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2020 3:58 PM ISTమీడియా సంస్థ అధినేతగా వ్యవహరిస్తూ వారం వారం కొత్తపలుకు కాలమ్ రాసే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఆయన రాసిన దాన్లో.. ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. కరోనా వేళలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు గురించి తనదైన విశ్లేషణ చేశారు.
ఇప్పుడు నడుస్తున్న విపత్తు కాలంలో తొలిదశలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా చేశారన్న పేరును తెచ్చుకుంటే.. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సర్కారుకే మార్కులు వేస్తున్నారు. చివరకు కరుడుగట్టిన తెలంగాణవాదులు సైతం జగన్ బాగా చేస్తున్నారంటూ మెచ్చుకోవటం కనిపిస్తుంది. ఇలాంటివేళలో జగన్ అంటే గిట్టని ఆర్కే.. ఏమని చెబుతారు? ఎలాంటి వాదనను వినిపిస్తారన్నది ఆయన మాటల్లో చూస్తే..
ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇరువురూ ప్రజలను కూడా కలుసుకోరు. ప్రతిపక్షాల వాసనే పడదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రగతి భవన్‌లో, ఎప్పుడు ఫామ్‌హౌస్‌లో ఉంటారో తెలియని పరిస్థితి! ఉభయ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న ఆలోచన ఇరువురు ముఖ్యమంత్రులకూ రాలేదు. తెలంగాణలో కరోనా పరీక్షలు అతి తక్కువగా జరుగుతున్నాయని దేశం కోడై కూస్తున్నప్పటికీ కేసీఆర్‌కు పట్టడం లేదు. తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే కేసీఆర్ పనితీరు బావుందని ఆంధ్రా ప్రజలు కూడా భావించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందని ఆర్కే కథనంలో రాసుకొచ్చారు.
కరోనా విషయంలో కాకుండా మరికొన్ని ఇతర విషయాల్లో కూడా కేసీఆర్ కంటే జగన్ పనితీరు బావుందని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారని ఆర్కే కొత్తపలుకులో వెల్లడించారు. మొండితనంతోపాటు కక్షపూరితంగా వ్యవహరించడంలో ఇద్దరిదీ ఒకే దారి అయినప్పటికీ, ప్రజలను మాయ చేయడంలో మాత్రం కేసీఆర్ కంటే జగన్ ఒక ఆకు ఎక్కువే చదివారనిపిస్తోంది. జగన్‌రెడ్డి ప్రకటిస్తున్న పథకాలన్నీ మాయామశ్చీంద్రను తలపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపించిన తొలి దశలో భారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా జగన్ మంచి మార్కులు కొట్టేశారు.
తెలంగాణలో అతి తక్కువ పరీక్షలు జరుగుతుండగా, ఏపీలో జగన్ ఎక్కువ పరీక్షలు చేయిస్తున్నారు అని తెలుగు ప్రజలే కాకుండా, జాతీయ మీడియా కూడా భావించింది. సేకరించిన శాంపిల్స్ ఆధారంగా అందరిలో ఇటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత ఏం జరుగుతున్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. సేకరించిన శాంపిల్స్‌లో 40 శాతం పరీక్షలకు నోచుకోవడం లేదు. ఆ తర్వాత కూడా పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందని పరిస్థితి! ఆస్పత్రిలో బెడ్ కావాలంటే పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇలాంటి మాయలనే ప్రదర్శించారు. ప్రతి దానినీ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. పత్రికలలో భారీగా ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రిక్కుల పట్ల మొహం మొత్తిందో ఏమో కానీ ప్రచారార్భాటానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్ అనుసరించిన మోడల్‌ను గమనించిన జగన్ ఇప్పుడు దాన్ని మరింత విస్తృతపరిచి అమలుచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో రెండు పర్యాయాలు భారీ ప్రకటనలు జారీ చేశారు. ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్టుగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా కేసీఆర్ కంటే జగన్ పనితీరు మెరుగ్గా ఉందన్న అభిప్రాయం విస్తరిస్తోందని ఆర్కే 'కొత్తపలుకు' అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.