ఆ రోజు పంత్‌ను ఎవ్వరూ ఆపలేరు
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 11:43 PM ISTటీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌పంత్‌లో అపారమైన ప్రతిభ దాగుందని పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కరోనా మహమ్మారి ముప్పు తో క్రీడాటోర్నీలన్ని రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐపీఎల్ వాయిదా పడడంతో భారత క్రికెటర్లు తమకు దొరికిన విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పేసర్ మహ్మద్ షమీ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించాడు. రిషబ్ పంత్ లో చాలా టాలెంట్ ఉందని, అతడు నా స్నేహితుడని.. ఈ మాటలు చెప్పలేదన్నాడు. ప్రస్తుతం పంత్లో ఆత్మ విశ్వాసం లోపించిందని తెలిపాడు. ఇటీవల పంత్ పేవల షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజైతే పంత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడో.. ఆరోజు అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు.
ప్రస్తుతం లోకేష్ రాహుల్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని ఏ స్థానంలో బరిలోకి దిగిన పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు. వికెట్ కీపింగ్ అతడి అదనపు బలం. రాహుల్ తన ఫామ్‌ను భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగించగలడని ఆశిస్తున్నానని తెలిపాడు. నా దృష్టిలో ఆల్‌రౌండర్ అంటే హార్ధిక్ పాండ్యానే అని అన్నాడు. ఎవరైనా ఆల్‌రౌండర్ కావాలనుకుంటే.. హార్దిక్ లాగా ఉండండని సూచించాడు. పొట్టి ఫార్మాట్ వినోదాన్ని పంచొచ్చు.. కాని తాను సాంప్రదాయ టెస్టు క్రికెట్ ను ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నాడు.