Fact Check : ఆ ట్వీట్లన్నీ రియా చక్రవర్తి లాయర్ చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేసి.. విచారణ చేస్తూ ఉన్నారు. ఆమె పలువురి పేర్లను కూడా బయట పెట్టిందంటూ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ప్రస్తుతం సతీష్ మానేషిండే అనే పేరుతో కొన్ని ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సతీష్ రియా చక్రవర్తిని డిఫెండ్ చేస్తున్న లాయర్ అన్న సంగతి తెలిసిందే..! ఆ పేరు మీద ఉన్న ట్విట్టర్ ఖాతాలో రియా చక్రవర్తి మద్దతుగా పలు ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. కేసు గురించి మాత్రమే కాకుండా రియా చక్రవర్తి ఎటువంటి తప్పు కూడా చేయలేదని అందులో నుండి ట్వీట్లు వస్తూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న చాలా మంది ఆ ట్వీట్లు సతీష్ అధికారిక ఖాతా నుండి వచ్చినవేనని భావిస్తూ ఉన్నారు.
మీడియా ట్రయల్స్ కు వ్యతిరేకంగా ఓ యాక్టివిస్ట్ బాంబే హైకోర్టులో కేసు పెట్టాడని ట్వీట్ లో వెల్లడించాడు. రియా చక్రవర్తిపై మీడియా కావాలనే ముద్ర వేసిందని చెప్పుకొచ్చాడు. “An activist has filed a plea in Bombay HC alleging ‘media trial’ against Rhea Chakraborty,” reads one such tweet. #mediatrial #TRPNoMore” అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లన్నీ నిజంగానే లాయర్ సతీష్ చేశారు అని పలువురు భావిస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ట్వీట్లన్నీ సతీష్ అధికారిక ఖాతాకు చెందినవి కాదు. ఈ పోస్టులు 'పచ్చి అబద్ధం'.
న్యూస్ మీటర్ ఆ ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా అది అధికారిక ఖాతా కాదని స్పష్టంగా తెలుస్తోంది. అదొక ఫ్యాన్ అకౌంట్..! ట్విట్టర్ లో ఉన్న బయోలో అది సతీష్ కు చెందిన ఫ్యాన్ అకౌంట్ అని తెలిపారు. ఈ అకౌంట్ ను సెప్టెంబర్ 2020లో క్రియేట్ చేశారు. 3900 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
యూజర్ నేమ్ @satishmaneshnde లో చివరి పేరులో స్పెల్లింగ్ తప్పులు ఉండడం గమనించవచ్చు. ‘Maneshinde’ కాగా యూజర్ నేమ్ వేరేదిగా ఉంది. దీన్ని బట్టి ఆ ఖాతాను ఎవరో వినియోగిస్తూ ఉన్నారని అర్థమవుతూ ఉంది. యూజర్ బయోలో ఉన్న వెబ్సైటు లింక్ “Satish.org” ను పరిశీలించగా అదొక డొమైన్ బ్రోకర్ సర్వీస్ లింక్ కు దారి తీసింది. ఆ డొమైన్ నేమ్ ను కొనుక్కోవాలని సూచించింది.
ఇక ట్వీట్లలో ఎన్నో స్పెల్లింగ్ తప్పులను గమనించవచ్చు. స్క్రీన్ షాట్స్ ను చూస్తే మీకే అర్థం అవుతుంది.
కాబట్టి వైరల్ అవుతున్న ఈ ట్వీట్లు రియా చక్రవర్తి లాయర్ సతీష్ అధికారిక అకౌంట్ కు చెందినవి కావు. రియా లాయర్ చేసిన ట్వీట్లు అన్నదానిలో 'ఎటువంటి నిజం లేదు'.