Fact Check : బెయిల్ వచ్చిందంటూ రియా చక్రవర్తి ట్వీట్ చేసిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే..! చాలా రోజుల పాటూ ఆమె పేరు వార్తల్లో నానింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు ఇందులో బెయిల్ వచ్చింది. బెయిల్ రావడంతో ముంబై లోని బైకుల్లా జైలు నుండి ఆమె విడుదలయ్యింది. జైలు నుండి విడుదలైన వెంటనే రియా చక్రవర్తి ట్వీట్ చేసిందంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
“Got bail after being in jail for 28 days, after all what was the crime.?,” అంటూ రియా చక్రవర్తి పేరు మీద ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఓ ట్వీట్ వచ్చింది.
చాలా మంది ఈ ట్వీట్ ను రియా చక్రవర్తి చేసింది అనుకుని రీట్వీట్లు కూడా చేశారు. 3000 మందికి పైగా లైక్ చేశారు. వందల సంఖ్యలో రీట్వీట్లు చేశారు.
నిజ నిర్ధారణ:
రియా చక్రవర్తి అఫీషియల్, వెరిఫై అయిన ట్విట్టర్ ఖాతాను న్యూస్ మీటర్ పరిశీలించడం జరిగింది. అందులో రియా చక్రవర్తి ఎక్కడ కూడా ఈ ట్వీట్ ను చేయలేదు. రియా చక్రవర్తి అధికారిక ట్విట్టర్ ఖాతా యూజర్ నేమ్ @Tweet2Rhea.. దీని జూన్ 2009లో క్రియేట్ చేసుకున్నారు. వైరల్ అవుతున్న ట్వీట్ ను @tweeter_rhea అనే ట్విట్టర్ ఖాతా నుండి పోస్టు చేశారు. ఈ ట్విట్టర్ ఖాతాను జులై 2020న క్రియేట్ చేసుకున్నారు. ఇదొక ఫేక్ అకౌంట్ అని.. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మొదలు పెట్టిన ట్విట్టర్ ఖాతా అని అర్థమవుతోంది.
ఈ ఫేక్ ట్విట్టర్ ఖాతాలో ఉన్న డీటెయిల్స్ ను పరిశీలిస్తే అది 'పేరడీ అకౌంట్' అని చెప్పుకొచ్చారు. రియా చక్రవర్తికి ఈ అకౌంట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.
రియా చక్రవర్తి అధికారిక ఖాతా అయిన @Tweet2Rhea నుండి ఆఖరి ట్వీట్ జులై 16, 2020న వచ్చింది. భారత హోమ్ మినిస్టర్ అమిత్ షాను ఆమె సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వయిరీ వేయమని కోరారు. ఆ తర్వాత ఆమె ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు. రియా చక్రవర్తి పేరు మీద ఉన్న ఈ ఫేక్ అకౌంట్ నుండి పలు పోస్టులు వచ్చాయి. హత్రాస్ ఘటన దగ్గర నుండి పాలిటిక్స్ వరకూ ఈ ఫేక్ అకౌంట్ నుండి ట్వీట్లు చేయడం జరిగింది.. ఆ సమయంలో రియా చక్రవర్తి జైలులో ఉంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న రియా చక్రవర్తి ఫేక్ అకౌంట్. ఆ ట్వీట్ కు రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదు. అది రియా అధికారిక ఖాతా నుండి వెలువడ్డ ట్వీట్ కానేకాదు.