సుశాంత్ కుటుంబంపై రియా సంచలన ఆరోపణలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2020 2:56 PM ISTబాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో జరిగిన అనేక పరిణామాల మధ్య తాజాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీం ఆదేశించింది. మరోవైపు, సుశాంత్ సూసైడ్ మిస్టరీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటివరకూ సుశాంత్ కుటుంబం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రియా.. తాజాగా సుశాంత్ కుటుంబంపైనే ప్రతి విమర్శలకు దిగారు. సుశాంత్ కుటుంబం మంచిది కాదని, ఓ సారి సుశాంత్ సోదరి తనతో అసభ్యంగా ప్రవర్తించిందని సంచలన ఆరోపణలు చేసింది రియా. ఆ ఘటన తర్వాతే సుశాంత్ కుటుంబానికి, తనకు మధ్య గ్యాప్ వచ్చిందని రియా ఆరోపించింది.
తాను మహారాష్ట్ర గృహిణికి, ఇండియన్ ఆర్మీలో సర్జన్ గా పనిచేసిన వ్యక్తి కుమార్తెనని, దర్యాఫ్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని రియా చెప్పింది. సుశాంత్ కుటుంబం దుర్గుణాలతో నిండిపోయిందని, ఏప్రిల్ 2019లో ఆ విషయాన్ని తాను గమనించానని ఆరోపించారు. 2019 ఏప్రిల్ లో తాను సుశాంత్ ఇంట్లో ఉన్న సమయంలో అతడి చెల్లెలు మద్యం తాగి తనను అసభ్యంగా తడిమిందని ఆరోపించింది. సుశాంత్ సోదరిని వారించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని, తర్వాత తాను కూడా వెళ్లిపోయానని రియా పేర్కొంది. ఈ విషయంలో సుశాంత్, అతడి సోదరిల మధ్య వాగ్వాదం జరిగిందని రియా చెప్పింది. ఆ ఘటన తర్వాత తనకు, సుశాంత్ కుటుంబానికీ మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపింది.
అలాగే.. ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు తన కుటుంబాన్ని కలుసుకోవాలని సుశాంత్ ఎంతో ప్రయత్నించారని, వారికి ఫోన్ చేసి ఏడ్చాడని రియా వెల్లడించింది. అయితే, ఇది చాలా పాత ఘటన అని, రియా మాటలు విని చెల్లితో గొడవ పడినందుకు సుశాంత్ క్షమాపణలు కూడా చెప్పారని రియా ఆరోపణలను సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది ఖండించారు.ఏది ఏమైనా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొన్న రియా.. తాజాగా సుశాంత్ కుటుంబంపై ఆరోపణ గుప్పించడం చర్చనీయాంశమైంది.