రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యాన్ని సర్వ్ చేయొచ్చు.. బార్లు మూసి ఉంచాల్సిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 12:33 PM GMT
రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యాన్ని సర్వ్ చేయొచ్చు.. బార్లు మూసి ఉంచాల్సిందే..!

ఢిల్లీ ప్రభుత్వం నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యాన్ని సర్వ్ చేయొచ్చని తెలిపింది. అయితే బార్లు మాత్రం మూసి ఉంచాల్సిందేనని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లు జూన్ 8 నుండి తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంగతి తెల్సిందే.. అయితే మద్యం సరఫరా చేయడాన్ని అనుమతించలేదు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ కు కొత్త నిబంధనలపై సూచనలు జారీ చేశారు. రెవిన్యూను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. బార్లు ఎప్పటిలాగే మూసి ఉంచుతామని అన్నారు. ఇప్పటికే అన్ లాక్ లో భాగంగా పలు రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పారు. లైసెన్స్ లు ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో కస్టమర్లకు మద్యం అందించవచ్చని అన్నారు.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఆగష్టు 16న రెస్టారెంట్లలో మద్యాన్ని సరఫరా చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ మన్ ప్రీత్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రెస్టారెంట్ యాజమాన్యాలకు ప్రభుత్వం ఎంతో మంచి చేసినట్లు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎక్సైజ్ కమీషనర్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తూ ఉన్నాయి.

Next Story
Share it