Fact Check : సంవత్సరానికి ఒక డాలర్ కంటే తక్కువ అద్దె.. 1520 నుండి అద్దె పెంచడం లేదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 2:41 PM GMT
Fact Check : సంవత్సరానికి ఒక డాలర్ కంటే తక్కువ అద్దె.. 1520 నుండి అద్దె పెంచడం లేదా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మిడిల్ క్లాస్ వాళ్లకు ఉండే మొదటి కల.. సొంత ఇంటిని కట్టుకోవడమే..! సొంత ఇంటిని కట్టుకోలేకపోతే అద్దెల మీద అద్దెలు కడుతూ ఉండాల్సి ఉంటుంది. నగరాల్లో అద్దెలు ఏడాది ఏడాదికీ పెరిగిపోతూ ఉంటాయి.. అదే చాలా భారంగా మారే అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా కూడా అద్దె పెంచుతూనే ఉండే ఓనర్లు కూడా ఉంటారు.

తాజాగా ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. జర్మనీ దేశం లోని ఫుగరాయ్ (Fuggerei) టౌన్ లో 1520 నుండి రెంట్ ను పెంచనే లేదట. అక్కడ ఉంటున్న ప్రజలతో అప్పట్లో ఒక డాలర్ కంటే తక్కువ '88 సెంట్లు' తీసుకునే వారట.. అది కూడా ఏడాదికి..! ఇప్పుడు కూడా అంతే తీసుకుంటూ ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.

'జర్మనీ లోని ఫుగరాయ్ టౌన్ లో 500 సంవత్సరాలుగా అదే అద్దె చెల్లిస్తూ ఉన్నారు'.. అంటూ పోస్టులు పెట్టడం గమనించవచ్చు.

జర్మనీ లోని ఆగ్స్ బర్గ్ దగ్గర ఉన్న ఫుగరాయ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. 15వ శతాబ్దంలో కట్టిన హోసింగ్ కాంప్లెక్స్ ఇది.. 2020లో కూడా అక్కడ 1520లో తీసుకున్న అద్దెనే తీసుకుంటూ ఉన్నారు.. 88 సెంట్లు ఒక్కో ఏడాదికి అని చెబుతూ వచ్చారు ఇంకొందరు.

నిజ నిర్ధారణ:

జర్మనీ లోని ఫుగరాయ్ లో 1520 నుండి అద్దె 88 సెంట్లు మాత్రమే తీసుకుంటూ ఉన్నారన్నది 'నిజం'.

జర్మనీ లోని పురాతన నగరాల్లో ఒకటైన ఆగ్స్ బర్గ్ కు దగ్గరలో ఫుగరాయ్ ప్రాంతం ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులోకి అతి త్వరలోనే ఫుగరాయ్ ను చేర్చనున్నారు. జాకబ్ ఫుగర్ 1520లలో ఫుగరాయ్ ను కట్టించడానని చరిత్రలో చెబుతూ ఉన్నారు. పేద ప్రజల కోసం ఈ ప్రాంతాన్ని కట్టించాడు. అతి తక్కువ అద్దెతో అక్కడ ఉండడానికి వీలు ఉంటుంది. అక్కడ ఉండాలి అనుకునే వారు తాము పేదరికంలో ఉన్నామని చెప్పాలి.. అలాగే తమకు ఎటువంటి అప్పులు కూడా లేవని ధృవీకరిస్తూ పత్రాలను సమర్పించాలి. ఇప్పుడు కూడా ఆ నియమాలు అలానే కొనసాగుతూ ఉన్నాయి.

ఫుగరాయ్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ప్రజలకు ఎంతో షాకింగ్ గా అనిపించే అంశమేమిటంటే 1520లలో అక్కడ ఎంత అద్దె చెల్లించే వారో.. ఇప్పుడు కూడా అంతే చెల్లిస్తూ ఉండడం. ఒక డాలర్ కంటే తక్కువగా 88 సెంట్లు మాత్రమే..!

అద్దె, ఆ ప్రాంతం ఎంతగానో కలిసొచ్చేలా మనకు అనిపించినప్పటికీ.. నాలుగేళ్లకు సరిపడేలా వెయిటింగ్ లిస్టు ఉందట. ముఖ్యంగా ఫుగరాయ్ హోసింగ్ కమ్యూనిటీలో కఠినమైన నిబంధనలు ఉంటాయి.

ఫుగరాయ్ లో నివసించాలని అనుకుంటే వారు 60 సంవత్సరాల పైబడిన వారై ఉండాలి.. అలాగే క్యాథలిక్ లు అయ్యుండాలి. ప్రతి రోజూ మూడు సార్లు ప్రేయర్లను నిర్వహిస్తూ ఉంటారు.. వాటన్నిటికీ ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. లార్డ్స్ ప్రేయర్, హెయిల్ మేరీ, నైసీన్ క్రీడ్ లలో పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ నివాసం ఉండే వారు వాచ్ మెన్ గా, చర్చిలో పలు పనులు చేయాల్సి ఉండడమే కాకుండా, తోటమాలి లాంటి పనులు చేస్తూ ఉండాలి.

కర్ఫ్యూల విషయంలో కూడా కఠినమైన నిబంధనలు ఉంటాయి. కాంప్లెక్స్ గేటును రాత్రి 10 గంటలకల్లా మూసి వేస్తారు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ అక్కడ ఉండడానికి వీలు పడదు కాబట్టి.. అక్కడ ఒక గైడెడ్ టూర్ అన్నది ఉంటుంది. ఆరు యూరోల దాకా చెల్లిస్తే ఆ ప్రాంతాన్ని చూసే అవకాశం లభిస్తుంది. అక్కడ రెండు మ్యూజియంలు, రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన బంకర్ లాంటి వాటివి చూడొచ్చు.

ఫుగరాయ్ అధికారిక వెబ్సైట్ లో ప్రస్తుతం అక్కడ 150 మంది నివాసం ఉంటున్నారని స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు, పేదవాళ్ళు అక్కడ ఉండొచ్చని.. మూడు ప్రేయర్లకు హాజరవ్వాల్సి ఉంటుందని పొందుపరచడం జరిగింది.

ఈ హోసింగ్ కాంప్లెక్స్ పేద వాళ్లకు సహాయం చేస్తున్నప్పటికీ.. అప్పుల్లో ఉన్న వాళ్లకు అక్కడ ఉండడానికి అనుమతిని ఇస్తుండకపోవడం బాధాకరమైన విషయమే..!

జర్మనీ లోని ఫుగరాయ్ లో 1520ల నుండి ఇప్పటి వరకూ అద్దె పెంచకపోవడం అనే పోస్టులు 'నిజమే'.

Next Story