అతివేగం ప్రాణాంతకం : కిందటేడాది ఏపీలో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 7,556

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 7:02 AM GMT
అతివేగం ప్రాణాంతకం : కిందటేడాది ఏపీలో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 7,556

ముఖ్యాంశాలు

  • మితిమీరిన వేగంతో ఘోర రోడ్డు ప్రమాదాలు
  • 2018లో ఏపీలో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 7,556
  • ఏపీ రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారి సంఖ్య 23,456

విజయవాడ: మితిమీరిన వేగం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 2018 సంవత్సరంలో అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,556, గాయాలపాలైన వారి సంఖ్య 23,456. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని రవాణా పరిశోధన విభాగం, రవాణా శాఖ అధ్యయనాల్లో తేలింది.

నిర్లక్ష్యం, అత్సుత్సాహం కారణం ఏదైనా కావొచ్చు, కానీ మితిమీరిన వేగంవల్ల జరుగుతున్న ప్రమాదాల్లో 82 శాతానికిపైగా దుర్మరణాలు నమోదవుతున్నాయి. 17,440 రోడ్డు ప్రమాదం కేసులను అధ్యయనం చేస్తే అందులో 6,196 మరణాలు పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి సూచనగా కనిపించాయి. ఇక గాయాలపాలైనవారు, పూర్తిగా అంగవికలురైనవారి సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. ఒకవేళ బతికి బయటపడినా జీవితాంతం మరొకరిమీద ఆధారపడి బతకాల్సిన స్థాయిలో ప్రమాదాలబారిన పడినవాళ్లు ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ మాటల్లో.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రహదారులు, జాతీయ రహదారుపై అనుమతింపబడే అత్యధిక వేగం 80 కిలోమీటర్లు మాత్రమే. కానీ దాదాపుగా 90 శాతానికిపైగా మోటార్ సైకిళ్లు నడుపుతున్నవాళ్లు నూటికినూరుశాతం ఈ వేగం పరిధిని మించే వాహనాలు నడుపుతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరలో మితిమీరిన వేగాన్ని నిరోధించే లేజర్ గన్స్ ని, వేగనిరోధకాలను కొనుగోలుచేసి జాతీయ రహదారులమీద అమర్చడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని డిజిపి సవాంగ్ తెలిపారు.

మరో ఏడాది ముందుకెళ్లిచూస్తే ఏపీలో 2017వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 8,060 మరణాలు సంభవించాయని, 25,727 మంది గాయాలపాలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 192మంది ప్రాణాలు కోల్పోయారని, 85మంది మద్యం సేవించి వాహనాన్ని నడపడంవల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారని లెక్కలు చెబుతున్నాయి.

మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన వేగం, హెల్మెట్ - సీట్ బెల్ట్ ధరించకపోవడం లాంటి కారణాలే రోడ్డుప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు పోవడానికి మూలకారణాలవుతాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ ధరించడంవల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోవడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టాన్ని గణనీయంగా నివారించవచ్చంటున్నారు.

జాతీయ రహదారులమీద లేజర్ గన్స్ ఏర్పాటు చేసినప్పటికీ రాత్రివేళల్లో వాహనాల వేగాన్ని అవి అందుకోలేవని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. ఈ కారణంగా రాత్రివేళల్లో వాహనాల వేగాన్ని నిరోధించడం అసాధ్యమంటున్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వాలు జాతీయ రహదారులపై యాంత్రికీకరణ, డిజిటలైజేషన్ సౌకర్యాలను ఏర్పాటుచేసినప్పుడు మాత్రమే రాత్రివేళల్లో ప్రమాదాలను నిరోధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story