పోలీసులతో జడేజా భార్య వాగ్వాదం..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 5:36 PM IST
పోలీసులతో జడేజా భార్య వాగ్వాదం..!

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి ఓ వివాదంలో చిక్కుకుంది. కరోనా రూల్స్‌ను అతిక్రమించిన విషయంలో సోమవారం రాత్రి పోలీసులతో జడేజా సతీమణి వాగ్వాదానికి దిగారని సమాచారం.

వివరాల్లోకి వెళితే.. రవీంద్ర జడేజా, అతని భార్య రివా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌కోట్ రింగ్ రోడ్‌లో కారులో వెళుతున్నారు. కారులో వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని సమాచారం. జడేజా మాస్క్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తుండగా.. అతడి భార్య రివా మాస్క్‌ ధరించలేదు. దీనిని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గుర్తించారు. కిసాన్‌పరా చౌక్‌ వద్ద జడేజా కారును ఆపారు. మాస్క్‌ ధరించని కారణంగా జరిమానా విధించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తనతో కానిస్టేబుల్‌ అతిగా వ్యవహరించిందని జడేజా కూడా పోలీసులకి తెలిపాడు.

గొడవపై రాజ్‌కోట్ డీసీపీ మనోహర్ ‌సిన్హా స్పందించారు. 'జడేజా తన సతీమణితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. జడేజా మాస్క్ ధరించగా.. రివా మాత్రం ధరించలేదు. దీనిని గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సోనాల్‌ గొసాయి కిసాన్‌ పరా చౌక్‌ వద్ద కారును ఆపారు. మాస్క్‌ ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా.. రివాబా వాగ్వాదానికి దిగారని ఆయన తెలిపారు. ఇరువురు పరస్పరం దూసించుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామన్నారు.

జడేజా ఇప్పటివరకు 49 టెస్టుల్లో, 165 వన్డేల్లో, 49 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం జడ్డూ సిద్దమవుతున్నాడు. త్వరలోనే చెపాల్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరానికి చేరుకోనున్నాడు.

Next Story