మోస్ట్ వాల్యూయెబుల్ టెస్ట్ క్రికెటర్‌గా జడేజా
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 11:30 AM IST21వ శతాబ్దంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అత్యంత విలువైన భారత క్రికెటర్ అని విజ్డన్ పేర్కొంది. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తరువాత రెండో అత్యంత విలువైన ఆటగాడు జడేజానేనని తెలిపింది. 31ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ బంతితో పాటు బ్యాటింగ్ ఫీల్డింగ్‌లో విశేషంగా రాణించాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, మిస్టర్ కూల్ దోనీని కాదని మోస్ట్ వాల్యూయెబుల్ టెస్ట్ క్రికెటర్‌గా జడేజా ఎంపికవడం విశేషం.
టెస్టుల్లో అశ్విన్ తరువాత అత్యంత వేగంగా 200వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్ జడేజా. కేవలం 44 టెస్లులో ఈ ఘనత సాధించాడు. జడేజా పనితీరును విశ్లేషించడానికి విజ్డన్ క్రికెట్‌లో వివరణాత్మక విశ్లేషణ సాధనమైన క్రిక్‌విజ్ అనే టూల్‌ను ఉపయోగించి లెక్కలు తీయడంతో 21 వ శతాబ్దంలో రెండో అత్యంత విలువైన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ విశ్లేషణ ప్రకారం 97.3 ఎంవీపీతో మురళీధరన్ మాత్రమే మొదటి స్థానంలో ఉన్నాడు.
జడేజా బౌలింగ్ సగటు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ కంటె మెరుగ్గా 24.62 గా ఉన్నది. ఇక, బ్యాటింగ్ సగటు 35.26. ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన జడేజా.. 1869 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్థశతకాలు, ఓ శతకం ఉండగా.. 213 వికెట్లు పడగొట్టాడు. ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను తొమ్మిది సార్లు సాధించాడు.