విండీస్ ఆటగాళ్ల టీ షర్ట్స్ పై ఆ నినాదాన్ని చూడబోతున్నాం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 11:12 AM GMT
విండీస్ ఆటగాళ్ల టీ షర్ట్స్ పై ఆ నినాదాన్ని చూడబోతున్నాం..!

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. నల్లజాతీయులపై హింస తగదంటూ పలువురు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు అవుతూ ఉన్నారు. ఇకపై వెస్టిండీస్ క్రికెటర్ల టీషర్టులపై 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అనే నినాదం ఉండబోతోంది. ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ కోసం విండీస్ ఆటగాళ్లు ధరించే టీషర్ట్ కాలర్ పై ఈ నినాదం ఉండబోతోంది.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి తమ మద్దతు, సంఘీభావం తెలపడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని.. ఇలా టీషర్ట్స్ మీద నినాదం ఉంచడం ద్వారా తమ మద్దతు తెలియజేస్తున్నామని విండీస్ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. ఇందుకు ఐసీసీ అనుమతి కూడా లభించిందని తెలుస్తోంది. ప్రీమియర్ లీగ్స్ ఆడుతున్న 20 ఫుట్ బాల్ క్లబ్స్ కూడా ఈ బాటను అనుసరించాయి.

తమ టీషర్ట్స్ పై ఈ లోగో, నినాదం ఉండడం సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టినట్టు అవుతుందని హోల్డర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లి విస్డెన్ ట్రోఫీని అందుకోవడం మాత్రమే తమ లక్ష్యం కాదని.. సమానత్వం గురించి చాటి చెప్పాలని భావిస్తున్నామని అన్నాడు జేసన్ హోల్డర్. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ దేశాల మధ్య జులై 8 నుండి మొదలుకాబోతోంది.

Next Story