మగవాడు ఎందుకు రేప్ చేస్తాడంటే..

By రాణి  Published on  4 March 2020 7:22 AM GMT
మగవాడు ఎందుకు రేప్ చేస్తాడంటే..

రేపిస్టులకు ఉరే సరి.. ఇది తరచుగా వినవచ్చే మాట. కానీ ఉరి శిక్షకి రేపిస్టులు భయపడుతున్నారా అంటే లేదనే అంటున్నారు పరిశోధకురాలు మధుమితా పాండే. మధుమిత ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తూ, యూకే లోని షెఫీల్డ్ హాలమ్ యూనివర్సిటీలో బోధిస్తున్నారు. రేపిస్టుల సైకాలజీ, వారి సామాజిక పరిస్థితులపైనే ఆమె ప్రధానంగా అధ్యయనం చేస్తూంటారు. నిర్భయ దుర్ఘటన తరువాత ఆమె తీహార్ జైల్ లో ఉన్న 142 మంది రేపిస్టులను ఇంటర్ వ్యూ చేశారు. ఈ అధ్యయనం ఆమె ఆలోచనను మార్చేసింది.

ఉరి శిక్ష వల్ల వారి ఆలోచనలు మారవని, సామాజిక పరిస్థితుల్లో మార్పు, అవగాహనా నిర్మాణం వల్ల మాత్రమే రేప్ ని అరికట్టగలమని ఆమె అంటున్నారు. కేవలం కఠిన శిక్షల ద్వారా మహిళా వివక్షను తొలగించలేమని, మహిళలు బలహీనులన్న భావం మగవారిలో ఉన్నంత కాలం ఏమీ చేయలేమని ఆమె అన్నారు. రేపిస్టులు క్రూరులని, చాలా నేరపూరిత స్వభావం కలిగిన వారని, మహిళలను చూడగానే లైంగిక దాడులకు పాల్పడతారని భావించడం పొరబాటని ఆమె అంటున్నారు. తాను ఇంటర్ వ్యూ చేసిన రేపిస్టులందరూ చాలా సౌమ్యంగా, నిదానంగా మాట్లాడారని, చాలా గౌరవం ఇచ్చి మాట్లాడారని ఆమె చెప్పారు.

రేపిస్టులలో తప్పు చేశామన్న భావన కనిపించిందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వారిలో అపరాథ భావన ఉన్నప్పటికీ అది మనం ఊహించినట్టుగా ఉండదని అన్నారు. తమను రేపిస్టుగా అందరూ పరిగణించడం పట్ల వారిలో సిగ్గు ఉంటుందని, తమపై అందరూ ముద్ర వేయడాన్ని వారు సహించరని ఆమె అన్నారు. వారు తమ వైపు వాదనను వినిపించే ప్రయత్నం చేస్తారని ఆమె అన్నారు. అయితే వారంతా రేప్ బాధితురాలిదే తప్పన్నట్టు మాట్లాడతారు. ఆమె రెచ్చగొట్టినందునే తాము రేప్ కి పాల్పడ్డామని అంటారు. మహిళ శరీరంపై తమకు హక్కుందని వారు భావించడం వల్లే రేప్ కి పాల్పడతారని ఆమె అన్నారు. లైంగిక అనుభవానికి మహిళ అనుమతి, ఆమోదం తప్పనిసరి అన్న విషయాన్ని వారు గుర్తించడం లేదని ఆమె చెబుతున్నారు. రేపిస్టులలో ఎక్కువ మంది తండ్రులు లేని వారేనని, తల్లి ఇంటిపనికే పరిమితం కావడం వల్ల మహిళలు వేరే రూపంలో కనిపిస్తే వారికి తప్పులా అనిపిస్తుందని ఆమె చెబుతున్నారు. సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరమైన అభిప్రాయాలే ప్రధానంగా రేప్ చేసేందుకు ప్రోత్సహిస్తాయని ఆమె అన్నారు.

Next Story