రాజధానిపై పవన్‌ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 8:11 AM GMT
రాజధానిపై పవన్‌ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు..!

తిరుమల: వైసీపీ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావు మరోసారి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనకు పూర్తి మద్దతు తెలుపుతున్నానని రాపాక పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మంచిపని చేస్తే ప్రభుత్వానికి మద్దతిస్తామని ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యనించారు. రాజధాని రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని, గతంలో బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని రాపాక అన్నారు. రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖను ఎడ్యుకేషనల్‌ క్యాపిటల్‌ చేయాలి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని రాపాక అన్నారు. పవన్‌ ఇంట్లోనే రెండు నిర్ణయాలు ఉన్నాయని.. అలాంటిది పార్టీలో రెండు నిర్ణయాలు ఉంటే తప్పేంటన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని అనడం లేదు గానీ, రాజధాని ఎక్కడ పెడతారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారని రాపాక వ్యాఖ్యనించారు.

అంతకుముందు తిరుమల శ్రీవారిని రాపాక దర్శించుకున్నారు. రాపాకకు స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు సబబే అన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులన్నిటిని హైదరాబాద్‌లో వెచ్చించారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.

మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం రాజధానుల అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో సృష్టమైన హామీ ఇవ్వాలని పవన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి రైతులకు మద్దతు తెలిపిన పవన్‌.. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి పార్టీకి వ్యతిరేకత రాకుండా చూస్తున్నారు. రాపాక వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. వైసీపీకి సపోర్టు చేయడంపై పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

Next Story
Share it