రానా పెళ్లి డేట్ ఫిక్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2020 7:20 PM ISTఇప్పుడిప్పుడే పెళ్లీ గిల్లీ లేదన్నట్లుగా సంకేతాలిస్తూ వచ్చిన దగ్గుబాటి రానా కొన్ని రోజుల కిందట పెద్ద షాకే ఇచ్చాడు. ఉన్నట్లుండి తన కాబోయే భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేశాడు. పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన మిహీకా బజాజ్‌తో అతను ఎంగేజ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇరు కుటుంబాలు కలిసి చిన్న గెట్ టు గెదర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నాయి. పెళ్లి చర్చలు మొదలుపెట్టాయి. రానా తండ్రి సురేష్ బాబు సైతం కొడుకు పెళ్లి పనులు మొదలవుతున్నట్లు ప్రకటించారు. ఐతే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్, ఇతర షరతులన్నీ తొలగిపోయాక ప్రశాంతంగా ఏడాది చివర్లో పెళ్లి జరిపిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇరు కుటుంబాల ఆలోచన అలా ఏమీ లేదని సమాచారం.
మరీ ఆలస్యం చేయకుండా ఇంకో రెండు నెలల్లోనే రానా, మిహీకలకు పెళ్లి చేసేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఆగస్టు 8న వీరి పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించారట. సాధ్యమైనంత తక్కువ మంది అతిథులతో సింపుల్‌గానే పెళ్లి జరిపించాలని భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారి.. పెళ్లి అతిథుల విషయంలో మినహాయింపులు, సడలింపులు వస్తే ఎక్కువమందిని ఆహ్వానిస్తారు కానీ.. లేదంటే ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు, బంధువులతో పెళ్లి వేడుక ముగించేస్తారు. ఇటీవలే మరో యంగ్ హీరో నిఖిల్ చాలా తక్కువమంది అతిథులతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు అగ్ర నిర్మాత దిల్ రాజు తన రెండో వివాహాన్ని సింపుల్‌గా చేసుకున్నారు. మరోవైపు నితిన్ సైతం షాలినితో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు. నిఖిల్, రానాల దూకుడు చూశాక అతను కూడా త్వరలోనే పెళ్లి తంతు కానిచ్చేసే అవకాశముంది.