ఢిల్లీ: అయోధ్య రామమందిరపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. మందిరం నిర్మాణం కోసం రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. ఈ ట్రస్ట్‌ మందిర నిర్మాణంపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని, అలాగే మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుందని తెలిపారు. రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్‌కు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. 67 హెక్టార్ల భూమిని రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ అప్పగిస్తున్నామని తెలిపారు.

రామ మందిరానికి నిర్మాణానికి అందరూ సహకరించాలని మోదీ కోరారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలకు ముందు ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశ ప్రజలు ప్రజాస్వామ్య విధానాలపై చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారని మోదీ అన్నారు. ఇందుకు 130 కోట్ల మంది భారతీయులకు నమస్కారం తెలియజేస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల భూమిని ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

గతేడాది నవంబర్‌లో అయోధ్యలోని బాబ్రీమసీదు- రామజన్మ భూమి భూవివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిరం కోసం అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. మసీదు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు వక్ఫ్‌ బోర్డుకు పూర్తి స్వేఛ్చ ఉంటుందని సుప్రీం వ్యాఖ్యనించింది. రామమందిర నిర్మాణానికి 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.