హనుమంతుడి సంజీవని మూలిక దొరికిపోయిందోచ్!!

By రాణి  Published on  5 Feb 2020 7:17 AM GMT
హనుమంతుడి సంజీవని మూలిక దొరికిపోయిందోచ్!!

రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం తాకి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడిని కాపాడాలంటే సంజీవని మూలికను తీసుకురావాలి. ఆంజనేయుడు బయలుదేరి వెళ్లాడు. సంజీవని పర్వతాన్ని చూశాడు. అందులో ఏది సంజీవనీ మూలికో తెలియలేదు. ఏకంగా పర్వతాన్నే మోసుకుని వచ్చాడు. వైద్యులు మూలికను వెతికి తీసి, లక్ష్మణుడిని బ్రతికించారు. అప్పట్నుంచీ హనుమాన్ చాలీసాలో “లాయ సంజీవన్ లఖన్ దియాహై” అని ఆంజనేయుడిని మనమంతా కొలుస్తున్నాం. అలాంటి సంజీవిన మూలిక ఇన్నాళ్లకు దొరికిపోయింది. దాని జాడ తెలిసింది.

అవునండీ..ఉత్తరాంచల్ రాష్ట్రంలోని పిథోరాగఢ్ అడవుల్లో జౌల్ జీవి అనే చోట ద్రోణగిరి పర్వతాల్లో ఒక మొక్క దొరికింది. శాస్త్రవేత్తలు దీనినే రామాయణ కాలపు సంజీవనీ మొక్క అంటున్నారు. లక్ష్మణుడికి ప్రాణదానం చేసిన మూలిక ఇదేనంటున్నారు. ఇప్పుడు పరిశోధకులు ఈ మొక్కను లక్నో లోని నేషనల్ బొటానికల్ లైబ్రరీకి పంపించారు. అక్కడే దీనిపై పరిశోధనలు చేసి, రామాయణంలో చెప్పిన సంజీవని ఇదేనని నిర్ధారించబోతున్నారు.

2016 లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంజీవని మొక్కను వెతికేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో బాగంగా ద్రోణగిరి పర్వతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆయుష్ విభాగం ఆధ్వర్యాన ఈ పనిని చేపట్టారు. రామాయణంలో ద్రోణగిరి పర్వతాన్ని ఆంజనేయుడు పెకలించి తీసుకువెళ్లాడని పేర్కొన్న నేపథ్యంలో పరిశోధనలు ద్రోణగిరి నుంచే ప్రారంభమయ్యాయి. అయితే పరిశోధకులు మాత్రం ఈ విషయమై పెదవి విప్పడం లేదు. రిపోర్టులు వచ్చిన తరువాతే మాట్లాడతామంటున్నారు. నిజంగా ఈ మొక్కే సంజీవని అయితే ఇక అన్ని నొప్పులకు, తీపులకు, కీళ్ల వ్యాధులకు, మూర్ఛలకు, గాయాలకు మంచి మందు దొరికేసినట్టే.

Next Story