సన్నని జుట్టుపై రాజ్యాంగ ఉపోద్ఘాతం.. భళా స్వర్ణిక..!
By అంజి Published on 26 Nov 2019 12:40 PM GMTనవంబర్ 26, 1949న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. తర్వాత జవనరి 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే, దేశంలో ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌గానూ పిలుస్తారు. ఈ విషయం సామాన్య ప్రజలకి తెలియక పోవచ్చు. కానీ, లా రెండవ సంవత్సరం చదువుతున్న రామగిరి స్వర్ణిక మాత్రం, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతాన్ని జుట్టు పైన రాసింది.
సూక్ష్మ కళాకారిణి అయిన స్వర్ణిక, ఎంతో ప్రయాసకు ఓడ్చి సన్నని జుట్టు పై "భారత ప్రజలమైన మేము…" అంటూ రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని కూర్చింది. మొదట సన్నని జుట్టు ని సమకూర్చుకొని, వాటిని అతికించింది. తరువాత, సన్నని బ్రష్ ని ఉపయోగించి తెల్ల పేయింట్ తో ఉపోద్ఘాతాన్ని రాసింది.
"అందరికీ జనవరి 26 గుర్తుంటుంది, కానీ నవంబర్ 26 కూడా భారతీయులకి ముఖ్యమైన రోజు. అందుకని, ప్రజలలో ఈ రోజు గురించి అవగాహన పేంచాలని అనుకున్నాను." అని అంటోంది రామగిరి స్వర్ణిక. అంతేకాకుండా, తెలంగాణ గవర్నర్, భారత దేశ రాష్ట్రపతిని కూడా కలిసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నానని ఆమె చెప్పింది. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు స్వర్ణిక ను యంగ్ ఆర్టిస్ట్ గా గుర్తించి రాష్ట్రీయ్ పురస్కారాన్ని అందించారు. సూక్ష్మ కళ గురించి మాట్లాడుతూ స్వర్ణిక, సూదులూ,బియ్యం, జుట్టు, నువ్వులు వంటివే తన పని ముట్లనీ, వాటితోనే తాను కళాఖండాలను తయారు చేస్తాననీ చెప్పింది. సూక్ష్మ కళకృతుల తయారీకి అలుపెరుగని పట్టుదల, కృషి అవసరమని స్వర్ణిక అంటోంది.