రామ్‌గోపాల్ వర్మ బయోపిక్ మొదలైంది
By తోట వంశీ కుమార్ Published on 16 Sept 2020 12:54 PM ISTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇప్పటికే ఎన్నో బయోపిక్‌లను తెరకెక్కించాడు. ఇక తన బయోపిక్‌నే తీయనున్నట్లు గతంలో వెల్లడించాడు వర్మ. ఈ బయోపిక్ మూడు భాగాలుగా రానుందని చెప్పిన సంగతి తెలిసిందే. మూడు పార్టుల్లో ముగ్గురు వ్యక్తులు నటించనున్నారు. కాగా.. మూడో పార్టులో వర్మనే నటించనున్నాడు. వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తన బయోపిక్ తెరకెక్కుతుందోంది. ఇక ఈ బయోపిక్‌కి సంబంధించిన మొదటి అడుగు తాజాగా పడింది.
రామ్ గోపాల్ వర్మ బయోపిక్‌కి సంబంధించి తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ కాలేజీలో వర్మ బయోపిక్ స్టార్ట్ మొదలైంది. వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే ఆయన సోదరి విజయ క్లాప్ కొట్టారు. ఈ మూడు భాగాలను బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఇక మొదటి భాగానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ భాగంలో వర్మ పాత్రలోనూ తేజ నటిస్తున్నారు. ఈ పార్ట్‌లో వర్మ కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ మొదలైనవి చూపించనున్నారు. అలాగే శివ చేయడానికి గల కారణాలను చూపించనున్నారు. దీనికి ‘రాము’ అనే టైటిల్ ఖరారు చేశారు.