సమన్లు అందలేదంటోన్న హీరోయిన్ రకుల్.. ఖండించిన అధికారులు
By తోట వంశీ కుమార్ Published on 24 Sep 2020 6:40 AM GMTబాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్ పేరు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. రకుల్‌తో పాటు పలువురు హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు ఇంత వరకు ఎలాంటి నోటీసులు అందలేదని అంటోంది రకుల్. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు సమన్లు అందలేదని తెలిపింది. ఈ మేరకు రకుల్ ప్రీత్ మేనేజర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కాగా, షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆ భామ నిన్న రాత్రి తిరిగి ముంబైకి వెళ్లింది.
కాగా.. రకుల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్‌సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. రకుల్‌కు సమన్లు జారీ చేశామని.. ఆమె ఫోన్‌లో అందుబాటులోకి లేదన్నారు. దీంతో.. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించామని చెప్పారు. కాగా.. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదన్నారు. ఆమె ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. కాగా, డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణే వంటి సెలబ్రిటీలను కూడా అధికారులు విచారించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24న శ్రుతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25.. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26న దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు.