ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్
By సుభాష్
ఏపీ లో రాజ్యసభ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి తన ఓటును బీసీ వర్గానికి చెందిన రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వేసినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ తరపున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పోటీ ఉండగా, టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది.
సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌కు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. శాసనసభలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓటులు అవసరమవుతాయి. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.