వైసీపీ యాక్షన్.. రఘురామ కృష్ణంరాజు రియాక్షన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 5:02 PM IST
వైసీపీ యాక్షన్..  రఘురామ కృష్ణంరాజు రియాక్షన్

వైసీపీ పార్టీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మధ్య ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. దీంతో రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని, అనేక సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారన్నారు.

ఈ షోకాజ్ నోటీసుకు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఊహించని విధమైన సమాధానం ఇచ్చారు. తనకు పంపిన షోకాజ్ నోటీస్‌‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాశారని.. తాను ఎంపీగా గెలిచింది మాత్రం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని కౌంటర్ వేశారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకటి ఉందని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు మీద తనకు షోకాజ్ నోటీస్ పంపారని.. కానీ తాను గెలిచిన పార్టీ ప్రాంతీయ పార్టీ అని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నానని.. ఎన్నికల సంఘానికి పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని.. వారి ద్వారా నోటీసులు పంపాలని పరోక్షంగా గుర్తు చేశారు. క్రమశిక్షణ కమిటీ సమావేశమై చర్చించి.. ఆ తర్వాత ఛైర్మన్, సభ్యులు కలిసి షోకాజ్ నోటీసులు పంపాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ అలాంటి సమావేశం జరిగితే.. ఆ భేటీకి సంబంధించిన మినిట్స్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం దగ్గర ఉన్న సమాచారం మేరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ లేదన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే ముందు అధినేత వైఎస్ జగన్ అనుమతితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌మీద ప్రింట్ చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేరు వాడకూడదని.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉపయోగించాలని సూచించిందన్నారు. క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే స్పందిస్తానని తేల్చి చెప్పారు.

Reply Letter dated 25th June, 2020

Next Story