విధ్వంసాన్ని జయించిన విధ్వంసం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Sept 2020 8:49 AM ISTఐపీఎల్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలోనే కనివినీ ఎరుగని విజయాన్ని సాధించింది. ఇరుజట్లు పరుగుల వరద పారించాయి. బ్యాట్స్‌మెన్ ఒకరిని మించి ఒకరు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అభిమానులకు అసలైన టీ20 మజాను రుచి చూపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్(69), మయాంక్(106)లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. వీరిరువురు తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్, పూరన్ ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.
అనంతరం చేధనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. బట్లర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మరో మారథాన్ ఇన్నింగ్స్‌తో గెలుపును సులువు చేశాడు. ఇక ఆల్‌రౌండర్ రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్, ఆర్చర్ (3 బంతుల్లో 13, 2 సిక్సర్లు) ల దూకుడు 224 పరుగుల లక్ష్యాన్ని సుసాధ్యం చేశాయి.