బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
By సుభాష్ Published on 19 Aug 2020 2:59 PM ISTఉత్తర బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది.ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని, అలాగే ఆగస్టు 23న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడంన ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల తెలంగాణ ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కొస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు ,ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ,రాయలసీమ జిల్లాలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్ ,నిర్మల్ కొమురం భీం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ , వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఐఎండీ డైరెక్టర్ రాజారావు మీడియాకు వివరించారు.
అయితే నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 1 నుంచి తెలంగాణలో సాధారణం కన్న 46 శాతం, కోస్తాంధ్రలో సాధారణం కన్నా 27 శాతం, రాయలసీమలో సాధారణం కన్నా 95 శాతం అధికంగా వర్షాపాతం నమోదైనట్లు తెలిపారు.